Cinema Updates Telugu: ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలతో ముందుకెళితేనే కెరీర్ ఉన్నతంగా సాగుతుంది. సాధించిన దానికి రెట్టింపు ప్రగతి వచ్చే ఏడాదిలో కనపడాలంటే కష్టపడాల్సిందే. దాని కంటే ముందు ఓ గొప్ప లక్ష్యం, ఆశ ఉండాల్సిందే. ఓ మంచి పాత్ర దక్కింది, మంచి గుర్తింపు వచ్చింది కదా అని అక్కడితో ఆగిపోతే నటుల కెరీర్‌లో మైలురాయి లాంటి పాత్రలు దక్కవు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకెళుతుంటారు మన సినీ తారలు. వెండితెరపై గ్లామర్ పాత్రల్లో అలరిస్తూనే వైవిధ్యమైన దారిలో నడుస్తున్న కొందరు నాయికలు 2022పై భారీ ఆశలే పెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఇంకా ఏదో సాధించేయాలనేది కొందరి అభిమతం. మరి ఆ నాయికలెవరో.. వాళ్ల మనసులో మాటేంటో చదివేద్దాం.
సోనాక్షి సిన్హా:"ఈ ఏడాది నేను పోషించే పాత్రలు, ఎంచుకునే కథలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండాలి. పూర్తి వైవిధ్యంగా సాగాలని కోరుకుంటున్నా. అదృష్టవశాత్తు ఇప్పటివరకూ నాకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. డ్రామాస్, థ్రిల్లర్స్, యాక్షన్ ఎంటర్‌టైనర్స్.. ఇలా చాలానే ఉన్నాయి. ఈ ఏడాదీ అంతకుమించి ఉంటుందని ఆశపడుతూ కష్టపడుతున్నాను. కెరీర్ పరంగా ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉన్నాను".
రకుల్ ప్రీత్‌సింగ్ :"నాకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం. అలాంటి ఓ మంచి ప్రేమ కథా చిత్రంలో ఈ ఏడాది నటించాలి. అంతేకాదు ఓ జీవిత కథలోనూ నటించాలని ఉంది. అన్ని రకాల కథల్లోనూ నటిస్తూ ప్రయోగాత్మక చిత్రాల్లో సవాల్ విసిరే పాత్రలు దక్కాలని కోరుకుంటున్నాను. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను".
హ్యూమా ఖురేషి: "గత ఏడాది నేను తీసుకున్న నిర్ణయాలు, నా పనులతో నేను సంతోషంగానే ఉన్నాను. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి మరిన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా భిన్న రకాలైన ఎంటర్‌టైన్‌మెంట్ వేదికల్ని బ్యాలన్స్ చేయాలనుకుంటున్నాను. ఓ పక్క ఓటీటీల కోసం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే సిరీస్‌ల్లో నటిస్తూనే మరోవైపు భారీ బాలీవుడ్ చిత్రాల్లో భాగం కావాలనుకుంటున్నాను".