కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశం మొత్తం లాక్డౌన్ విధించారు. ఆ సమయంలో రెండున్నర నెలల పాటు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల షూటింగులు నిలిచిపోగా.. ఇటీవలే వాటిని తిరిగి మొదలుపెట్టేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. జూన్ 15 నుంచి తెలంగాణలో చిత్రీకరణలు ప్రారంభమవగా.. జులై 15 నుంచి ఆంధ్రాలోనూ షూటింగ్‌లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. పరిమిత సిబ్బంది, శానిటైజేషన్, మాస్క్ తప్పనిసరి వంటి జాగ్రత్తలతోనే షూటింగ్‌లు జరపాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే చిత్రీకరణలపై కొద్దిపాటి పరిమితులు విధించడం మనకు కొత్తేమి కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే ఇదే తరహా నిబంధనలు పాటించినట్లు తెలుస్తోంది.
ఆ కారణంగానే?
1942-43 కాలంలో రెండో ప్రపంచ యుద్ధం తారాస్థాయిలో ఉంది. సినిమాకు కావాల్సిన ఫిల్మ్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అయితే విదేశీ దిగుమతులపై బ్రిటీష్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా, కొడాక్ ముడి ఫిల్మ్ కొరతతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై అధికారులకు విన్నవించుకోగా.. స్పందించిన ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది.
కొత్తగా సినిమాలు తీయాలనుకునే కంపెనీలకు అనుమతులు నిరాకరించారు. అంతకు ముందు ప్రారంభమై, చిత్రీకరణ మధ్యలో ఉన్న వాటికి మాత్రమే పర్మిట్ ఇచ్చారు. అందులో మరో నిబంధననూ విధించారు. చిత్రం కోసం ఉపయోగించే రీలు పొడవు 11 వేల అడుగులకు మించకూడదని అన్నారు. దానిని పాటిస్తూనే ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి.. 'సర్వసీమ' తీశారు. 11 వేల అడుగుల రీల్‌నే దీనికోసం వినియోగించగా.. సినిమా మాత్రం హిట్‌గా నిలిచింది. ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడు, బెంగళూరులోని పలు కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమైంది.
అలా తొలిసారి ఆంక్షల మధ్య టాలీవుడ్లో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఇదే తరహాలో స్టార్ హీరోల చిత్రాలు తీయబోతున్నారు. చిత్రీకరణలకు అనుమతిచ్చిన ప్రభుత్వాలు... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు తెరిచేందుకు అంగీకరించట్లేదు.
ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం