తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమా కష్టాలు: చిత్రసీమ ముందున్న సవాళ్లెన్నో! - cinema shooting will free in Andhra pradesh

లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చినా చిత్రీకరణకు, సినిమాల ప్రదర్శనకు అనుమతి దక్కలేదు. ఒకవేళ అనుమతి వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలు చిత్రీకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది వారిని తొలుస్తున్న ప్రశ్న. మరి ఆ సవాళ్లను ఎదుర్కొని షూటింగ్​లు ఎలా చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. వాటిని ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై చిత్రపరిశ్రమ దృష్టి సారిస్తుంది.

Cine Industry Should have faced more Challenges If the government allows to shoot
చిత్రీకరణకు అనుమతిచ్చినా మరెన్నో సవాళ్లు!

By

Published : May 20, 2020, 6:50 AM IST

కొత్త సినిమాల సందడికి చిత్ర పరిశ్రమ దూరమై రెండు నెలలు పూర్తయింది. కరోనా ప్రభావంతో సినిమా క్యాలెండర్‌ మొత్తం మారిపోయింది. ఈ విపత్తు నింపిన చీకట్ల నుంచి వెండితెర పూర్తిస్థాయిలో వెలుగులు సంతరించుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఇక నుంచి చిత్రసీమ కరోనాకి ముందు... తర్వాత అని విడదీసి చూసేలా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లపాటు మునుపటిలా పరిస్థితులు ఉండవన్నది ఖాయం. థియేటర్లు తెరుచుకోవడానికి ముందే చిత్రీకరణలకి అనుమతులు లభించే అవకాశాలున్నాయి. ఒకవేళ చిత్రీకరణలకు అనుమతులు వచ్చినా సినీ వర్గాలకు స్వాగతం పలికేందుకు అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు సినీ పరిశ్రమ వర్గాలు వాటిపైనే దృష్టిపెట్టాయి.

విడుదల కష్టాలు

పరిస్థితులు బాగున్నప్పుడే చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కష్టం. ఇక లాక్‌డౌన్‌ తర్వాత వాటి పరిస్థితి గురించి అనేక భయాలు నెలకొన్నాయి. అగ్ర హీరోల సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. దాంతో వాటి వసూళ్లపైనా ప్రభావం పడుతుంది. అయితే థియేటర్లు తెరచుకున్నా ప్రేక్షకులు మునుపటిలాగా వస్తారా అనే సందేహం నిర్మాతల్ని వెంటాడుతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలు, పాన్‌ ఇండియా సినిమాలకు ఓవర్సీస్‌ మార్కెట్లూ కీలకమే. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, దుబాయ్‌ లాంటి ఓవర్సీస్‌ మార్కెట్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి ఆదాయం దక్కుతోంది. కాబట్టి ఇలాంటి చిత్ర నిర్మాతలు ఆయా రాష్ట్రాలు, దేశాల్లోని పరిస్థితులను కూడా అంచనా వేసుకునే ముందుకు రావాల్సి ఉంటుంది.

సెట్లో భద్రత

సినిమా చిత్రీకరణ వందల మందితో కూడుకున్న వ్యవహారం. భౌతిక దూరాన్ని పాటిస్తూ చిత్రీకరించడం పెద్ద సవాలే. తక్కువ మంది చిత్రబృందంతో మాత్రమే చిత్రీకరణ జరపాల్సి వస్తే సినీ నిర్మాణాలు మరింత ఆలస్యమవుతాయి. అది నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపిస్తుంది. నటీనటుల్లో భయాల్ని తొలగించి, వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించి సెట్స్‌కు తీసుకురావడమన్నది మరింత క్లిష్టమైన అంశం.

"కరోనా భయం ఇప్పట్లో పోదు. దానికి వ్యాక్సిన్‌ వచ్చిందంటే తప్ప మునుపటిలాగా ధైర్యంగా చిత్రీకరణలు చేసుకునే పరిస్థితులు ఉండవ" అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

లొకేషన్ల సమస్య

అగ్ర కథానాయకుల సినిమా అంటే కచ్చితంగా విదేశాల్లో చిత్రీకరణ ఉంటుంది. దానికోసం విమానం ఎక్కాల్సిందే. కానీ కరోనా ప్రభావం విదేశాల్లోనే ఎక్కువ. దాంతో ఇప్పట్లో అక్కడ చిత్రీకరణలు కష్టమే. పొరుగు రాష్ట్రాల్లో చిత్రీకరణలకూ అనుమతులు రావడం కష్టమే. విదేశీ లొకేషన్లని సెట్ల రూపంలో ఇక్కడే ఆవిష్కరించే పరిస్థితులు రానున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌తో రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న సినిమా కోసం యూరప్‌ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్లని రూపొందించి అందులో చిత్రీకరణ చేశారు. ఆ తరహా సెట్స్‌కు నిర్మాణ వ్యయం భరించడం సాధ్యమా అన్నది ప్రశ్న. బడ్జెట్‌ తగ్గిస్తే పారితోషికాల్లోనూ కోత పడొచ్చు.

నటీనటుల లభ్యత

చిత్రీకరణలకు అనుమతులు ఎప్పుడు లభిస్తే అప్పుడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని సినిమాలూ ఒకేసారి ప్రారంభిస్తే నటీనటులు ఏస్థాయిలో అందుబాటులో ఉంటారు? వాళ్ల డేట్లని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ప్రశ్న. హీరోలైతే ఒక్కో సినిమానే చేస్తారు. కానీ నాయికలు, సహ నటుల విషయంలో సమస్యలు రావొచ్చు.

ప్రచారం మాటేమిటి?

సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో భాగంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్లు, విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇకపై ఇలాంటి వాటికి వీలుండకపోవచ్చు. ఇటీవల ఓ వెబినార్‌లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. "కరోనా వల్ల వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఇకపై సినిమాల్ని, వాటి నిర్మాణాన్ని మార్చుకోవాలి. మూస ధోరణిలో వెళ్తే బోల్తా పడతాం" అన్నారు. "ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకుని అధ్యయనం చేశాకే చిత్రీకరణలకి సిద్ధమవ్వాల"ని నిర్మాత సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు.

ఏపీలో ఉచితంగా చిత్రీకరణలకు అనుమతి

సినిమా, టెలివిజన్‌ చిత్రీకరణల్ని ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్రీకరణల కోసం ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా అనుమతుల్ని ఇస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర, టెలివిజన్‌ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్‌ విండో ప్రాతిపదికన సులభతరంగా అనుమతులివ్వనున్నట్టు సంస్థ ఛైర్మన్‌ విజయ్‌ చందర్‌ అన్నారు.

ఇదీ చూడండి.. నూనూగు మీసాలోడు.. బాక్సాఫీసును కొల్లగొట్టేశాడు

ABOUT THE AUTHOR

...view details