'ఏ విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి' అని అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలుగు ప్రభుత్వాలను కోరారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ వేడుక((love story prerelease event)) జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్‌ఖాన్, అగ్ర కథానాయకుడు చిరంజీవి విచ్చేశారు. 'లవ్‌స్టోరీ' చిత్ర బృందానికి చిరు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.
"కొవిడ్ తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావటం చిన్నపిల్లవాడు స్కూల్‌కు వెళ్తున్న భావన కలుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. చిత్ర పరిశ్రమలో సక్సెస్‌రేట్ అనేది చాలా తక్కువ. 10-15శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే, 20శాతం. ఈ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా, కళకళలాడిపోతోందంటారు. కానీ, ఇక్కడ కూడా కష్టాలు పడేవారు, రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది.. పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే చిత్ర పరిశ్రమ. నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదు. వీళ్లు బాగున్నారు కదాని, సినిమా ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు. ఈ విషయం కరోనా సమయంలో స్పష్టంగా కనిపించింది. నాలుగైదు నెలలు షూటింగ్స్ ఆగిపోయే సరికి, కార్మికులు అల్లాడిపోయారు. హీరోలను, సినీ పెద్దలను, నిర్మాతలను అడిగి డబ్బులు పోగుచేసి, కార్మికుల కోసం నిత్యావసర సరకులు అందించాం. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయి. కానీ, ఒక నెల షూటింగ్ లేకపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా"