Priest Rangarajan on Akhanda : ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ సినిమాపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. గత వారం తాను, తన సేవక బృందంతో కలిసి ‘అఖండ’ చూసినట్లు చెప్పారు. అప్పుడే ఈ సినిమా గురించి చెప్పాలనుకున్నా గానీ, కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయానన్నారు. ఈ మేరకు సినిమాపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతోందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. ‘అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమాలో చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చనే సిద్ధాంతాన్ని స్పష్టంగా సినిమాలో చూపించారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు ఈ సినిమాను అందరూ చూస్తున్నారంటే.. వారి మనసుల్లో ఉక్రోషం.. ఆక్రోషం.. తపన ఉంది. ఏమీ చేయలేకపోతున్నామనే బాధ ఉంది. ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది. రాజ్యాంగం ఉంది. అయినా మన ధర్మానికి అన్యాయం జరుగుతోంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసమే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది పాలకులు గుర్తించాలి’’ అని తన అభిప్రాయాన్ని వీడియో సందేశంలో వివరించారు.