ఓ పక్క కరోనా చిత్రసీమను అతలాకుతలం చేస్తుంటే మరోపక్క తౌక్టే తుపాను కూడా ఇండస్ట్రీని కష్టాల్లోకి నెట్టేసింది. అకాల వర్షాలతో ముంబయి నగరం అతలాకుతలం అయ్యింది. ఈ ప్రభావం బాలీవుడ్‌పై ఎక్కువగానే కనిపిస్తుంది. పలు భారీ చిత్రాలకు నష్టాలు మిగిల్చింది తౌక్టే తుపాను. పలు సినిమాల కోసం ఇప్పటికే భారీ సెట్లు వేశారు. కరోనా కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇప్పుడు తుపాను కారణంగా తీవ్రంగా ధ్వంసంమయ్యాయి.
ముంబయిలోని ఓ స్టూడియోలో అజయ్ దేవగణ్ నటిస్తోన్న 'మైదాన్' చిత్ర సెట్ ఉంది. తుపాను కారణంగా ఆ సెట్ కూలిపోయినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. దీంతో దాదాపుగా రూ.30 కోట్ల వరకు నష్టపోయినట్లు నిర్మాత బోనీ కపూర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
"మైదాన్' కోసం భారీ ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ను తీర్చిదిద్దాం. చివరి షెడ్యూల్లో భాగంగా ఇందులో 8 మ్యాచ్‌లను చిత్రీకరించాలని భావించాం. నాలుగు మ్యాచ్‌ల చిత్రీకరణ పూర్తయింది. ఇంతలోనే కరోనా రెండోదశ ప్రభావంతో అంతా ఆగిపోయింది. ఇప్పుడు తౌక్టే తుపాను దెబ్బకు సెట్ నాశనం అయ్యింది. ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. నాకు దాన్ని పదేపదే గుర్తు తెచ్చుకోవాలని లేదు. వాటి గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు షూటింగ్ కోసం సెట్ మళ్లీ పునఃనిర్మించాలి. దీంతో బడ్జెట్ మరింత పెరిగిపోతుంది. అది నా మనసులోకి వస్తే మళ్లీ నిరాశకు గురవుతాను".