డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తితో ముడిపెడుతూ తనపై కథనాలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించాలంటూ సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్.. శనివారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఆసోషియేషన్‌లను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేసింది.
గతంలో కొన్ని నివేదికలు తనపై తప్పుడు ప్రచారాన్ని చేశాయని.. అలా చేయకుండా ఆదేశమివ్వాలని దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది రకుల్.
డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరుకాక ముందే తన పేరును మీడియాలో రాకుండా చర్యలు చేపట్టడానికి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది రకుల్.
అక్టోబరు 15కు వాయిదా
ఈ కేసుకు సంబంధించి కేంద్రప్రభుత్వం, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్ అసోసియేషన్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీంతో పాటు రకుల్‌ప్రీత్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా ఆదేశాలను ఇవ్వడం సహా దీనిపై సత్వరం తమ నిర్ణయాన్ని తెలపాలని కోర్టు వారికి విజ్ఞప్తి చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.