ముంబయిలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నివాసానికి మంగళవారం బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. సబర్బన్ బాంద్రాలోని కంగనా రనౌత్‌కు పాలిహిల్ బంగ్లా ఉంది. పౌరసంఘం అనుమతి లేకుండా ఆ భవంతిని నిర్మించారని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల నోటీసులను గేటు బయట అంటించినట్లు ఓ అధికారి తెలిపారు. 24 గంటల్లోగా కంగనా స్పందించి.. బీఎంసీకి, పౌర సంస్థకు తగిన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
కంగన ఆఫీసుకూ నోటీసులు..!
ముంబయిలోని తన కార్యాలయాన్నీ బీఎంసీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. తన పొరుగువారిని కూడా వేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు ట్విట్టర్లో వెల్లడించింది కంగన.
వై-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ
ఇటీవలే బాలీవుడ్ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే తాను ఎక్కువగా భయపడుతున్నట్లు కంగన చెప్పింది. దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్.. ఆమెను ముంబయికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. దీనిపై స్పందించిన కంగన.. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ట్వీట్ చేసింది. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. దీంతో ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కంగనకు వై- ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. దేశంలోనే అతిపెద్ద పారా మిలిటరీ దళమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కంగనకు రక్షణగా ఉండనున్నారు.