పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్‌కుంద్రా పరువుకు భంగం వాటిల్లే విధంగా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలు మీడియా సంస్థలతో పాటు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో తమ గురించి తప్పుగా రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా.. "భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు" అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ గౌతమ్ పటేల్ ఈ విధంగా తెలిపారు.
"పోలీసులు చెప్పిన వివరాలను ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతిదాన్నీ అడ్డుకోవాలంటే పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపినట్లవుతుంది. భార్యాభర్తల మధ్య సంభాషణ పోలీసుల ముందే జరిగింది. అలా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మీడియా రిపోర్టులు వచ్చాయి. పిటిషన్‌దారు పబ్లిక్ లైఫ్‌ను ఎంచుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీల జీవితాన్ని ప్రజలు ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో తన భర్తతో ఎందుకు వాదన పెట్టుకున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా మేము వ్యవహరించలేం. అయితే పిటిషనర్ పిల్లల పెంపకం గురించి మీడియాలో కథనాలు రావడం మాత్రం అభ్యంతరకరమైనదే".