తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు తెరపై మరో 'తారకరాముడు'

ఆయన తాత సినీ రంగంలోనూ, రాజకీయంలోనూ రాణించి నటసార్వభౌముడిగా, మహానేతగా అభిమానుల హృదయాలను గెలుచుకుంటే... మనవడిగా ప్రస్తుతం అంతే ఆదరణ చూరగొంటున్నారు జూనియర్​ ఎన్టీఆర్​. 'నిన్ను చూడాలని' చిత్రంతో వెండితెరపై మెరిసి 25 సినిమాలు పూర్తయ్యేసరికి అందనంత ఎత్తుకు ఎదిగిన ఆ యంగ్​టైగర్​... నేడు 36వ పడిలోకి అడుగుపెడుతున్నారు.

birthday of junior ntr

By

Published : May 20, 2019, 7:05 AM IST

'కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా... దేనికైనా రెడీ' అంటూ జూనియర్​ ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ సినిమాలో పాట పాడుకొన్నారు. ఆ సినిమాలోని పాత్రకే కాదు, నిజ జీవితంలో ఎన్టీఆర్‌కి కూడా వర్తిస్తుంది ఆ పాట. డ్యాన్సుల్లోనైనా.. ఫైట్లలోనైనా... భావోద్వేగాలు పండించడంలోనైనా.. వినోదం పండించడానికైనా... ఇలా దేనికైనా ఎన్టీఆర్‌ రెడీనే. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. తాత పోలికలతో పుట్టిన ఎన్టీఆర్‌... నటన పరంగా తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు. నూనూగు మీసాల వయసులోనే రికార్డులతో బాక్సాఫీసును బద్దలు చేసిన ఘనత ఆయనది.

సీనియర్​ ఎన్టీఆర్​తో జూనియర్​

తొలి అడుగుల్లోనే స్టార్‌ కథానాయకుడిగా ఎదిగాడు ఎన్టీఆర్​. ఆ తర్వాత ఆటుపోట్లు ఎదురైనా... పడి లేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత శక్తిమంతమైన స్టార్‌ కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు ఎన్టీఆర్‌.

సినిమా రంగంపైనే కాకుండా... బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశాడు జూనియర్​ ఎన్టీఆర్​. నటన పరంగానే కాకుండా.. గాయకుడిగా కూడా తన ప్రావీణ్యం ప్రదర్శించారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో 25 సినిమాల మైలురాయిని అధిగమించిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు.

భాగ్యనగర బంగారం

నందమూరి హరికృష్ణ, షాలినీ దంపతులకు 1983, మే 20న హైదరాబాద్‌లో జన్మించాడు ఎన్టీఆర్‌. విద్యారణ్య హైస్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. చిన్నప్పుడే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు. బాలనటుడిగా ‘బాలరామాయణం’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తొలి అడుగులోనే నందితో మెరిసి వెండితెరను పులకింపజేశాడు. లక్ష్మీప్రణతిని 2011 మే 5న వివాహం చేసుకున్నాడు ఎన్టీఆర్​. ఆయనకు నందమూరి అభయ్‌రామ్, భార్గవరామ్‌ కుమారులు.

భార్యా పిల్లలతో జూ.ఎన్టీఆర్​

తొలిమెరుగులు తాతగారితోనే...

అంతకు ముందే నందమూరి తారక రామారావు సారథ్యంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో అద్భుతమైన నటనను కనబర్చి నటసార్వభౌముడినే మెప్పించాడు ఎన్టీఆర్​. చిరు ప్రాయంలోనే చిరుతలా తెలుగు తెరపై నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేశాక మరింత జోరు చూపించాడు.

ఆ స్టూడెంట్​ ఓ నెంబర్​.1

'నిన్నుచూడాలని'తో తొలిప్రయత్నంలో నిరాశపర్చినా 'స్టూడెంట్‌ నెం.1'తో నటుడిగా తనలోని పూర్తి ప్రతిభను సినీ ప్రియులకు రుచి చూపించాడు ఎన్టీఆర్​. భవిష్యత్‌ టాలీవుడ్‌ నెం.1 కథానాయకుడిని తానేనంటూ ఆనాడే చెప్పకనే చెప్పాడు.

'ఆది' కేశవ రెడ్డిగా రికార్డుల తొడగొట్టి.. 'సింహాద్రి'తో విజయదరహాసం చేసి... 'ఆంధ్రావాలా'గా తెలుగువారి మదిని దోచుకున్నాడు ఎన్టీఆర్​. ఆ తర్వాత మూడేళ్లపాటు పరాజయాలతో ఉక్కిరిబిక్కిరయినా 'యమదొంగ' తో పడిలేచిన కెరటంలా వెండితెరపై మెరుపులు మెరిపించాడు యంగ్‌టైగర్‌. ఆ తర్వాత ‘అదుర్స్‌’ అనిపించే కథలతో ‘బృందావనం’లో కృష్ణుడిగా అపజయమెరుగని సినీ ప్రయాణం సాగిస్తూ ‘ఊసరవెల్లి’లా వైవిధ్యమైన పాత్రలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు.

టాలీవుడ్​లో తనదైన స్థానం..

చిత్ర సీమలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్‌ కథానాయకుడిగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఎన్టీఆర్​. ఇటీవల కాలంలో ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకొన్నాడు.

గాయకుడిగానూ...

‘యమదొంగ’తో పాటు... ‘కంత్రీ’, ‘అదుర్స్‌’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల్లో గీతాలు ఆలపించి గాయకుడిగా కూడా మెప్పించాడు ఎన్టీఆర్‌. తెలుగులోనే కాకుండా కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘చక్రవ్యూహం’ అనే చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ ఓ పాట పాడారు.

ఇవీ చూడండి--> బర్త్​డేకు దూరంగా యంగ్​ టైగర్​..!

ABOUT THE AUTHOR

...view details