తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భాగ్యశ్రీ ప్రత్యేకం: ప్యార్​ కియా.. అభిమానుల గుండె లయ - మై నే ప్యార్​ కియా

సినీ అభిమానులను 'మై నే ప్యార్​ కియా' అంటూ మతి పోగొట్టిన అందాల తార భాగ్యశ్రీ. తన అందంతో ఎంతోమంది కుర్రకారును మాయ చేసిన ఈమె పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

Bhagya sree birthday special story
ప్రేక్షకుల కళ్లలోన కలవో.. అభిమానుల గుండెలోన లయవో..

By

Published : Feb 23, 2020, 5:11 AM IST

Updated : Mar 2, 2020, 6:16 AM IST

చిత్ర పరిశ్రమలో ప్రతి వారానికి ఓ కొత్త నాయిక పరిచయమవుతున్నా... ఒక్కోసారి విస్ఫోటనం లాంటి అందం విరుచుకుపడి వీక్షకుల హృదయాలపై మంత్రజలం జల్లుతుంది. అత్తరు తుఫానులా చెలరేగి వెన్నెల మంటలు రగిలిస్తుంది. తన సౌందర్యంతో తేనెటీగలా కుట్టి తీపి గాయాలు చేస్తుంది. ఎంత చూపు తిప్పుకున్నా... ఆ సోయగం పదే పదే వెంటాడి వేటాడి నానా గందరగోళంలో పడేస్తుంది. దశాబ్దానికోసారి అలాంటి ముగ్ధమోహన సౌందర్యం ఆవిష్కృతమై ప్రేక్షకజన హృదయ సింహాసనాలపై తిష్ట వేస్తుంది. ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపేసిన ఓ భాగ్యశ్రీలా. ఔను... భాగ్యశ్రీ అందానికే అందం. మత్తైన కళ్లు... పున్నమి వెన్నెల వాకిళ్లు.

పెదాలంచునా సాగే చిరునవ్వులు సరికొత్త సౌందర్యానికి శాశ్వత చిరునామాలు. ఆమె రాక... బాలీవుడ్‌కు ఏరువాక. ఆమెను చూసి చూడగానే మనసు పారేసుకున్నవారెందరో? 'మై నే ప్యార్‌ కియా' అంటూ హొయలుపోయారు మరెందరో? రాజశ్రీ సంస్థ అందించిన సంగీతభరిత ప్రేమ కథాచిత్రం 'మై నే ప్యార్‌ కియా'లో తెరంతా పరచుకున్నది ఆమె స్నిగ్ద సౌందర్యమే. కొన్నాళ్లపాటు ఆ సినిమా మేనియా నుంచి ప్రేక్షకలోకం బయటపడలేకపోయింది. ఆ అందాల బొమ్మ భాగ్యశ్రీ పుట్టినరోజు నేడు(ఫిబ్రవరి 23). ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

భాగ్యశ్రీ

రాచరికపు అందాలు

మహారాష్ట్ర సాంగ్లీ అనే రాచరికపు కుటుంబానికి చెందినది భాగ్యశ్రీ. వీరిది మరాఠీ కుటుంబం. 1969 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి విజయ్‌ సింఘ్రావు మాధవ్‌ రావ్‌ పట్వర్ధన్‌. అతడు మహారాష్ట్రలోని సాంగ్లీ రాజు. భాగ్యశ్రీ పెద్ద కుమార్తె. భాగ్యశ్రీ సోదరిలైన మధువంతి, పూర్ణిమలూ నటీమణులే. మధువంతి 'దో ఆంఖే బారాహ్‌ హాత్‌' సినిమాలో నటిస్తే 'తాజ్‌ మహల్‌ ఎ మాన్యుమెంట్‌ ఆఫ్‌ లవ్‌' అనే సినిమాలో పూర్ణిమా నటించింది. పూర్ణిమ 'కచ్చి ధూప్‌'లో నటించగా... ఇందులోని నటనకు బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవార్డ్‌ పూర్ణిమను వరించింది.

భాగ్యశ్రీ

అలా...సినిమాల్లోకి

భాగ్యశ్రీ తండ్రి విజయ్‌ సింఘ్రావ్‌ మాధవ్‌ రావ్‌ ఎం.బి.ఎ, ఎల్‌.ఎల్‌.బి చదివాడు. సంస్కృతంలోనూ మంచి పట్టు ఉంది. తన తండ్రి శ్లోకాలు చదువుతూ ఉండడంతో చిన్నతనం నుంచి భాగ్యశ్రీ సంస్కృతం నేర్చుకునేది. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లాలని భాగ్యశ్రీ అనుకుంది. ఆ సమయంలో నటుడు, ఫిల్మ్‌ మేకర్‌ అమోల్‌ పాలేకర్‌ మాజీ భార్య షీలా కంట పడింది భాగ్యశ్రీ. 'కచ్చి ధూప్‌' అనే బుల్లితెర సీరియల్‌ కోసం భాగ్యశ్రీని సంప్రదించింది షీలా. ఆ టీవీ సీరియల్‌ ఎంతో పాపులర్‌ అయింది. ఫలితంగా మరికొన్ని 'కిస్సే మియా బివి కె' తదితర వాటిలో నటించింది భాగ్యశ్రీ.

వీటి ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొన్న భాగ్యశ్రీకి ఆ తరువాత 'మైనే ప్యార్‌ కియా' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావటం వల్ల తర్వాత మరో ఆరు సినిమాలలో నటించింది. వాటిలో రెండు బంగ్లాదేశ్‌ సినిమాలు కాగా... మరో రెండు సినిమాలు కన్నడ పరిశ్రమకు చెందినవి. మరో రెండు సినిమాలు తెలుగువి. మారుతోన్న భాషలు భాగ్యశ్రీకి సమస్యే కాలేదు. ఎందుకంటే, భారతదేశంలోని భాషలు సంస్కృతం నుంచి వచ్చినవి కాబట్టి భాగ్యశ్రీకి చిన్నతనంలో తాను నేర్చుకొన్న సంస్కృతం భాష ఎంతో సహాయపడింది.

'మైనే ప్యార్‌ కియా' సినిమాతో ఎంతో పాపులారిటీ సంపాదించుకొంది భాగ్యశ్రీ. అయితే ఆ సినిమా విడుదలైన కొంత కాలానికే తన బాయ్‌ ఫ్రెండ్‌ హిమాలయ దస్సానిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొంది. ఆ తర్వాత భర్తతోనే మూడు సినిమాలలో నటించింది. వాటిలో 'త్యాగి', 'పాయల్‌' చిత్రాలు ఉన్నాయి. అయితే, ఇవేమి బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేకపోయాయి.

ఆ తరువాత కుటుంబం మీదకు దృష్టి మరల్చింది భాగ్యశ్రీ. ఆమె ఇద్దరు సంతానం. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతతో నెలలో కేవలం పదిహేను రోజులు మాత్రమే పనిచేస్తుంది. భాగ్యశ్రీకి ఒక కుమారుడు ఒక కుమార్తె. 2019 నాటి 'మర్ద్‌ కో దర్ద్‌ నహి హోత' సినిమాకు బెస్ట్‌ మేల్‌ డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకొంది.

భర్త, కుమారుడితో భాగ్యశ్రీ

ఒక టీవీ సీరియల్‌తో బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. అందులో ఆమె పరిణతి చెందిన రాజకీయ నాయకురాలి పాత్ర పోషించింది. 'హంకో దీవానా కర్‌ గయే', 'జనని' చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించింది.

తెలుగులో భాగ్యశ్రీ

'ఓంకారం' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ 'రానా' సినిమాలోనూ నటించింది. '2 స్టేట్స్‌' తెలుగు రీమేక్‌లో భాగ్యశ్రీ నటిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారంపై స్పష్టత లేదు. ప్రభాస్‌ 'జాన్‌' సినిమాలో ప్రభాస్‌ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

భాగ్యశ్రీ

ఇతర బాధ్యతలు

శ్రిష్టి ఎంటర్టైన్మెంట్‌ అనే మీడియా సంస్థకు భాగ్యశ్రీ తన భర్తతో పాటు ప్రమోటర్‌గా వ్యవహరిస్తుంది. 2015 మార్చిలో, భాగ్యశ్రీ స్కీంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ స్కీమ్‌ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దారిద్య్రరేఖ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలను ఆదుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

కుమార్తె, కుమారుడితో

పురస్కారాలు

'మైనే ప్యార్‌ కియా' సినిమాకు బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూగా ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకొన్న భాగ్యశ్రీ 'లవుట్‌ ఆవో త్రిషా' అనే టెలివిజన్‌ షోకి సంబంధించి పెరఫార్మెర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ విభాగంలో ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డ్స్‌కు ఎంపిక అయింది.

ఇదీ చూడండి..#ఆస్క్ తమన్నా: క్రేజీ ప్రశ్నలు.. ఆసక్తికర సమాధానాలు

Last Updated : Mar 2, 2020, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details