స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఏకకాలంలో రెండు సినిమాలు తీస్తుండటం ఇటీవల టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అందులో ఒకటి రవితేజ 'టైగర్ నాగేశ్వరావు', మరొకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'స్టూవర్టుపురం దొంగ'. ఇప్పటికే 'స్టూవర్టుపురం దొంగ' షూటింగ్ ప్రారంభం కావడం.. సాయి శ్రీనివాస్‌పై పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ తీసుకున్న ఓ నిర్ణయంతో ఇప్పుడు బెల్లంకొండ హీరో సినిమా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
సాధారణంగానే బయోపిక్‌లకు ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుంది. అందులోనూ గజదొంగ జీవితం కావడం వల్ల ఈ బయోపిక్‌పై అందరిలో ఆసక్తి ఎక్కువగానే ఉంది. దాంతో 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని పాన్‌ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ చిత్రబృందం భావించింది. ఈ క్రమంలోనే ఆ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయాలని సదరు టీమ్ భావిస్తుందట.