Bangarraju movie Blockbuster Meet : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రాజమహేంద్రవరంలో ‘బ్లాక్ బస్టర్ మీట్’ వేడుకను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
‘‘కొవిడ్ కారణంగా రెండేళ్లుగా సంక్రాంతి వేడుకలు సాదాసీదాగా సాగాయి. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో కళను తీసుకొచ్చిన నాగార్జున గారికి థాంక్స్. ఈ వేడుకను రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా సంతోషం. చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ‘‘ఈ వేడుకను ఇక్కడ నిర్వహించినందుకు బంగార్రాజు చిత్ర బృందానికి ధన్యవాదాలు. నేనూ మా అన్నయ్య నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన స్టైల్ అనుసరించేవాళ్లం. తొలిసారి ఆయన్ను ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం చూసి ఎలా ఉందో ట్వీట్ చేస్తా’’ అని ఎంపీ భరత్‌రామ్ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ప్రపంచమంతా భయపడుతున్నా.. ఉత్తరాదిలో చిత్రాల విడుదల ఆపేసినా.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి చూస్తాం.. మీకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాం అని చెప్పిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి అని మీరంతా మరోసారి నిరూపించారు. నేను వసూళ్ల గురించి మాట్లాడేందుకు రాలేదు. మీ గురించి మాట్లాడటానికే ఇక్కడికి వచ్చా. మీ ఆదరాభిమానాలు చూసినప్పుడల్లా మా నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు)కి థాంక్స్ చెప్పాలనిపిస్తుంటుంది. ఏపీ సీఎంతో ఇటీవల జరిగిన భేటీ గురించి మిత్రుడు చిరంజీవిని అడిగా. ‘సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారని అందరూ అంటుంటారు. ఈరోజు ఎన్టీఆర్ వర్థంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆయన్ను మనం గుర్తుచేసుకోవాలి. చేసుకుంటాం’’ అని అన్నారు.