"మంచి సినిమాల్ని ఎప్పుడూ ఆదరిస్తామని నాన్న (ఎన్టీఆర్) గారి నుంచి నిరూపిస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచికి నా కృతజ్ఞతలు. 'అఖండ' విజయం.. చలన చిత్ర పరిశ్రమ సాధించిన విజయం" అని బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందు కొచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గురువారం విజయోత్సవాన్ని నిర్వహించారు.
"కరోనా పరిస్థితుల్లో ఇంతటి పెద్ద విజయం ఇచ్చిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఈ చిత్రం పరిశ్రమకు ధైర్యాన్నిచ్చింది. అభిమానుల్ని పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నా నుంచి వాళ్లు ఏమీ ఆశించరు. విజయాలిచ్చినా, పరాజయాలిచ్చినా నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు. దర్శకుడు బోయపాటి ఏ సినిమాకూ నాకు పూర్తి కథ చెప్పలేదు. ఒకట్రెండు సన్నివేశాలు చెబుతారంతే. మా ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉంటుంది. అందుకే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది" అని బాలయ్య అన్నారు.
గ్రాండ్ సక్సెస్‌మీట్‌లో అఖండ టీమ్ "ప్రేక్షకుడికీ థియేటర్‌కు బంధం తెగిపోతుందనే భయాలు నెలకొన్న దశలో, ఒక మంచి సినిమా తీస్తే మళ్లీ మళ్లీ చూసి పెద్ద విజయాన్ని అందిస్తామని 'అఖండ'తో ప్రేక్షకులు నిరూపించారు. ఈ సినిమాతో ప్రేక్షకులు మాకు డబ్బులు ఇవ్వడం కాదు, పరిశ్రమకే ధైర్యాన్నిచ్చారు. మామూలుగా నటులు ఒక మంచి పాత్ర చేస్తున్నారంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు. అదే బాలయ్య పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రే ఉత్సాహపడుతుంది. మాస్ అంటే అరిచి చెప్పేది కాదు, మాస్ అంటే మంచి చెప్పి అరిచేలా చేసేది. ఈ సినిమాలో దేవుడు గురించి, మంచి గురించి చెప్పాం. ఆత్మ శుద్ధి, వాక్శుద్ధి ఉన్నవాళ్లు చెబితేనే అలాంటివి ప్రేక్షకుల్లోకి వెళతాయి. అవన్నీ ఉన్న కథానాయకుడు బాలకృష్ణ. అందుకే ప్రేక్షకులు ఇంతటి విజయాన్నిచ్చారు" అని బోయపాటి శ్రీను అన్నారు.
ఈ కార్యక్రమంలో నటులు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, నితిన్ మెహతా, రాంప్రసాద్, ఏ.ఎస్.ప్రకాశ్, శంకర్, శ్రవణ్, నాగమహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: