వరస ఫ్లాప్‌లతో సతమతమవుతోన్న దశలో 'సింహా', 'లెజెండ్'ల రూపంలో బాలకృష్ణకు భారీ విజయాలను అందించాడు బోయపాటి శ్రీను. ఇప్పుడీ జోడీ ముచ్చటగా మూడోసారి సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. మార్చి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించుకోబోతుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడని, అందులో ఓ పాత్ర కోసం అఘోరాగా దర్శనమివ్వబోతున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా ఈ హీరో రెండు పాత్రల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
అఘోరాగా బాలయ్య ఎంట్రీ అప్పుడే..! - Balakrishna Turns As Aghora
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. తాజాగా ఈ ద్విపాత్రాభినయం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ చిత్రంలో బాలయ్య కవలలుగా ఉంటారని, చిన్నతనంలోనే వాళ్లిద్దరినీ వేరు చేయడం వల్ల ఒకరు వారణాసిలో.. మరొకరు అనంతరపురంలో పెరుగుతారని సమాచారం. ఈ రెండు పాత్రలు చిత్ర ఇంటర్వెల్ సమయంలో కలుస్తాయని, ఆ ఎపిసోడ్‌లో అఘోరాగా బాలయ్య ఎంట్రీ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. మరి ఈ కవలలిద్దర్నీ వేరు చేసింది ఎవరు? అసలు వాళ్లిద్దరి కథ ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా బయటకొచ్చే వరకు వేచి చూడక తప్పదు.
బాలకృష్ణ ఇప్పటికే అఘోరా పాత్ర కోసం తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు. వచ్చే నెలలో వారణాసిలో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌ను ఈ పాత్ర చిత్రీకరణతోనే మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్యకు జోడీగా అంజలి నటిస్తుండగా.. మరో నాయిక పాత్రకు ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.