కరోనా లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ముంబయి నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2 వేల ఆహార ప్యాకెట్లను మధ్యాహ్నం, సాయంత్రం పంచనున్నట్లు గురువారం ఆయన తెలిపారు. దీంతో పాటు 3 వేల బస్తాల నెలవారీ సరుకులను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
"నా వ్యక్తిగత ఖర్చుతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికోసం ప్రతిరోజూ 2 వేల ప్యాకెట్ల ఆహారాన్ని మధ్యాహ్నం, సాయంత్రం అందిస్తాం. అంతేకాకుండా నెల సరుకులకు గానూ 3 వేల బస్తాలు పంచటానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కనీసం 12 వేల మంది ఆకలిని తీరుస్తాయి. లాక్డౌన్లో ఇంటి నుంచి బయటకు రావటం కుదరదు. అలా చేస్తే వీటిని పంచే క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరుగుతుందని.. ఆ పరిస్థితులను నియంత్రించలేమని పోలీసులు తెలిపారు."