'అరుంధతి' మొదలుకొని 'భాగమతి', 'రుద్రమదేవి' వంటి కథానాయిక ప్రాధాన్య పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ అనుష్క. తాజాగా తన సినీ కెరీర్లో చేసిన అతిపద్ద సాహసం గురించి చెప్పమని అడగ్గా ఈ ముదుగుమ్మ మాట్లాడుతూ.. "'అరుంధతి', 'బాహుబలి', 'భాగమతి' లాంటి నాయికా ప్రాధాన్య చిత్రాల కోసం కత్తి యుద్ధాలు నేర్చుకున్నా. గుర్రపు స్వారీలు చేశా. ఇవన్నీ నాకు గొప్ప సాహసాలే. కానీ, నేను జీవితంలో చేసిన అతి పెద్ద సాహసమంటే 'బిల్లా' చిత్రాన్నే గుర్తు చేసుకోవాలి" అని వివరించింది.
'నా జీవితంలో చేసిన అతిపెద్ద సాహసం అదే' - anushka about her career biggest challange
కథానాయిక పాత్రలకు ప్రాణం పోసి, ఎన్నో సాహసాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. తాజాగా తన సినీ కెరీర్లో చేసిన అతిపెద్ద సాహసంపై ఆసక్తికర విషయాలు పంచుకుంది స్వీటి.
"'బిల్లా' సినిమాలో నేను చాలా ఎత్తు నుంచి దూకే సన్నివేశం ఒకటుంది. దర్శకుడు తొలుత నాకు ఆ సన్నివేశం గురించి చెప్పినప్పుడు ఏదోలా పూర్తి చేసేద్దాంలే అనుకున్నా. కానీ, షాట్ పూర్తవ్వగానే నాకు కళ్లు తిరిగినంత పనైంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఆ భయాన్ని ఎప్పుడోకప్పడు వదిలించుకోక తప్పదు. అందుకే 'బిల్లా'లో సీన్ కోసం ప్రయత్నించా. కానీ, అది బెడిసి కొట్టినట్లే అనిపించింది. అందుకే మళ్లీ ఈ తరహా సాహసమెప్పుడూ చెయ్యలేదు. చాలా మంది కొండల పైనుంచి బంగీ జంప్ చేస్తుంటారు. నిజంగా నన్నలాంటి చోట్లకు తీసుకెళ్తే చచ్చిపోతానేమో అనిపిస్తుంటుంది (నవ్వుతూ)" అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది స్వీటి.
ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' చిత్రంలో నటిస్తోంది. ఇందులో అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, మైఖైల్ మ్యాడ్‌సన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ప్రధానాంశంగా వస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.