సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరించడం పట్ల నటి అంకితా లోఖండే సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
'సీబీఐకి సుశాంత్ కేసు.. అంకిత సంతోషం'
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని నటి అంకిత లోఖండే తెలిపింది. బుధవారం బిహార్ ప్రభుత్వం సిఫార్సు మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించింది.
బిహార్ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.
ఈ కేసులో దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ముంబయి పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంపై వచ్చే వారం విచారణ చేయనున్నట్లు జస్టిస్ రాయ్ పేర్కొన్నారు. అంతకంటే ముందు ముంబయి పోలీసులు ఇప్పటి వరకు ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.