వాణిజ్యాంశాలు నిండిన వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు అతడి నుంచి వచ్చిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 అన్నీ ఈ బాటలో నడిచి విజయాలందుకున్నవే. తాజాగా ఈ సంక్రాంతికి మహేష్‌బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అంటూ వినోదాలు పంచబోతున్నాడు. జనవరి 11న ఈ చిత్రం విడుదల కానున్న తరుణంలో మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ దర్శకుడు.
"ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరుతో దిగిన ఫొటో చూసి మా ఇద్దరి కలయికలో సినిమా వస్తుందేమోనని అంతా అనుకుంటున్నారు. ఈ స్పందన చూస్తుంటే వాళ్లే నాతో చిరుతో ఓ సినిమా చేయించేలా ఉన్నారనిపిస్తోంది (నవ్వుతూ). నిజంగా నాకు ఆయనతో పనిచేసే అవకాశమొస్తే ఎగిరి గంతేస్తా. ఆయన ఊ.. అనాలే కానీ, కథ రాయడం ఎంత సేపు. మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తా. గతంలో బాలకృష్ణ సర్‌తో ఓ సినిమా అనుకున్నాం. ఆయన బిజీగా ఉన్నారు. చూడాలి ఏమౌతుందో" -అనిల్ రావిపూడి, దర్శకుడు