స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. రష్మిక కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మిస్తున్నారు. గురువారం అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో 'పుష్ప' పాత్ర పరిచయ టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. 'తగ్గేదే లే..' అంటూ అల్లు అర్జున్ అందులో చేసిన సందడి అలరిస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు.
"ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం. 'పుష్ప' టీజర్ వచ్చింది. 'ఐకాన్ స్టార్' అని ఓ కొత్త పేరు వచ్చింది. అప్పుడు 'ఆర్య' ఇచ్చినందుకు, ఇప్పుడు కొత్త పేరు ఇచ్చినందుకు సుకుమార్‌కి కృతజ్ఞతలు. సుకుమార్ నాకు ఏం ఇచ్చినా గుర్తుండిపోయేలా ఉంటుంది. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద పరిశ్రమగా అవతరిస్తుంది. దేవిశ్రీప్రసాద్, నేను, సుకుమార్ కలిసి చాలా రోజుల తర్వాత కలిశాం. పాటల పరంగా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటుంది సినిమా. నా పుట్టినరోజును పురస్కరించుకొని చాలా మంది అభిమానులు చాలా మంచి పనులు చేశారు. అందుకు గర్వపడుతున్నా. తగ్గేదే లే.. అనే మాట సినిమాలో నా పాత్ర వాడే పదం. నేను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు చెప్పుకొనే ఒక మాట అది. అందరిలాగే నాకూ భయాలుంటాయి. అప్పుడు ధైర్యం చేసి ముందడుగు వేసేయ్, పరాజయం ఎదురైనా పర్వాలేదు అని చెప్పుకుంటుంటా. అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం రాగలిగా."
- అల్లు అర్జున్, కథానాయకుడు