Allu arjun sid sriram: తన మధురమైన వాయిస్‌తో అందర్నీ కట్టిపడేస్తున్నారు గాయకుడు సిద్ శ్రీరామ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆయన ట్రెండే నడుస్తోంది. 'పుష్ప' చిత్రంలో ఆయన ఆలపించిన 'శ్రీవల్లి' ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆయనపై ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"విశ్రాంతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. 'పుష్ప' ప్రీరిలీజ్ వేడుకలో నా సోదరుడు సిద్ధ్ శ్రీరామ్ స్టేజ్‌పై అందరి ముందు 'శ్రీవల్లి' పాట లైవ్‌లో పాడుతున్నప్పుడు ఇది జరిగింది. అతడు పాట పాడటం ప్రారంభించిన తర్వాత మ్యూజిషియన్స్ ఎలాంటి వాయిద్యాన్ని ప్లే చేయకుండా చూస్తూ అలాగే ఉండిపోయారు. కానీ.. శ్రీరామ్ మాత్రం పాడటం ఆపలేదు. సంగీతం లేకుండానే పాట పాడుతూ అందర్నీ ఆలరించారు. ఆయన పాట ఎంతో అద్భుతంగా సాగింది. ఆ సమయంలో నాకేమనిపించిందంటే.. అతడికి మ్యూజిక్‌తో పనిలేదు.. ఎందుకంటే అతడే మ్యూజిక్ కాబట్టి" అని బన్నీ పొగిడారు. మరోవైపు బన్నీ ప్రశంసలపై సిద్ శ్రీరామ్ స్పందించారు. ఆ మాటలు తనకు ప్రపంచంతో సమానమని అన్నారు.