ఈ బక్కపల్చటి వ్యక్తి సినిమాల్లో పనికొస్తాడా అని కొందరు అంటే.. జానపద చిత్రాలతో మెప్పించగలడా అని అనుమానించిన వారు మరికొందరు. ఈ శరీరాకృతితో పౌరాణిక పాత్రలు వేస్తే జనాలు చూసినట్లే అని హేళన చేశారు ఇంకొందరు. వీటిన్నింటికి తన నటనతో సమధానమిచ్చాడు. అనుకుంటే సాధ్యం కానిది లేదని నిరూపించాడు. ఓ సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన ప్రయాణం.. ఎంతోమందికి ఆరాధ్యుడిని చేసింది. ఆయనే అక్కినేని నాగేశ్వరరావు. ఏఎన్ఆర్ 96వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
బహుదూరపు బాటసారి అక్కినేని..
85 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు. నటనలో వజ్రోత్సవం(75 ఏళ్లు) జరుపుకొన్న అతికొద్ది మందిలో ఏఎన్ఆర్ ఒకరు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అక్కినేని ఓ శకం. ఆయన గురించి రాసేందుకు పేజీలు కాదు.. గ్రంథాలు కావాలి.
ఎన్టీఆర్‌తో అక్కినేని నాగేశ్వరరావు తిండి కోసం కష్టాలు పడిన రోజులు
1923 సెప్టెంబరు 20న ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఉన్నత చదువులు చదువుకోలేదు. ఓ పూట తిండికోసం కష్టాలు పడిన రోజులు.. అక్కినేని జీవితంలో ఉన్నాయంటే నమ్మబుద్ది కాదు. చిన్ననాటి నుంచి స్వయంకృషితోనే ఎదిగారు. నాస్తికుడైనా ఏఎన్ఆర్.. దేవుడ్ని నమ్మేవాళ్లకు అడ్డు చెప్పలేదు. తనకు నచ్చింది చేశారు. గెలుపైనా.. ఓటమైనా.. పూర్తి బాధ్యత తనే తీసుకునేవారు.
నిద్రపోయేవారు కాదు..!
వ్యక్తిత్వంలో అక్కినేని ఉన్నతమైన మనిషి. తనపని తాను చూసుకునేవారు. సాహసాలు చేయడమంటే ఆయనకు ఇష్టం. ఏ పనైనా తనవల్ల కాదు అని ఎవరైనా అంటే అది చేసేవరకు నిద్రపోయేవారు కాదు.
ఆడపిల్లలా ఉన్నావంటూ వెక్కిరించారు..!
తొలినాళ్లలో నాటకాలు వేసేవారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తున్న సమయంలో, ఆడపిల్లలా ఉన్నావంటూ కొందరు ఆయన్ని ఎగతాళి చేసేవారు. వీటిన్నింటికి తన ఎదుగుదలతోనే సమాధానమిచ్చారు.
బ్రేక్ డ్యాన్సులు పరిచయం చేసింది ఈయనే
అక్కినేనిది ఓ ప్రత్యేక ప్రపంచం. తన స్టైల్‌ను తానే సృష్టించుకున్నారు. అందుకే ఆయనకు ఆయనే సాటి. తెలుగు తెరకు స్టెప్పులు పరిచయం చేసిన కథానాయకుడు ఏఎన్ఆర్. ఇప్పుడున్న బ్రేక్ డాన్సులు, షేక్‌డాన్సులు రావడానికి కారణం అక్కినేని. హీరో అనేవాడు స్టెప్పులేయాలని చూపించిన స్టైలిష్ నటుడు ఏఎన్ఆర్.
మూకీ నుంచి త్రీడీ వరకు
85 ఏళ్ల సినీ పరిశ్రమ గమనంలో 75 ఏళ్ల పాటు కళామతల్లి సేవలోనే తరించారు. మూకీ చిత్రాలతో మొదలైన ఆయన ప్రయాణం త్రీడీ వరకు కొనసాగింది. టాలీవుడ్ దాటిన ప్రతి మలుపును దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఈ నటుడు. మూకీ, టాకీ, కలర్, సౌండ్, 70 ఎమ్ఎమ్, డీటీఎస్, ఐమాక్స్, త్రీడీ ఇలా సినిమాకు సంబంధించిన అన్ని కోణాల్ని చూసిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు.
ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేందుకు ఈయనే కారణం
తెలుగు సినీపరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో ఏఎన్ఆర్ కీలకపాత్ర పోషించారు. ఎంతో కష్టపడి, ఎన్నో ఆటంకాలను అధిగమించి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. హైదరాబాద్‌లో టాలీవుడ్ కేంద్రీకృతం కావడానికి కారకుడయ్యారు.
అవార్డులు ఈయన పరిపాటి
కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్, 1989లో రఘుపతి వెంకయ్య, 1990లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996లో ఎన్టీఆర్ అవార్డులు అందుకున్నారు. 2011లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక నటుడు అక్కినేని కావడం విశేషం.
డాక్టర్లు వద్దన్నారు.. అక్కినేని ఎదురునిలిచారు..
40 ఏళ్ల క్రితం అక్కినేనికి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. ఆయన బతకడం కష్టమని చెప్పారు. గుండె సర్జరీ తరవాత కూడా 40 ఏళ్లు జీవించారు
. ఈ విషయంతో ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థమవుతుంది. క్యాన్సర్ సోకిందని ధైర్యంగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిన మనిషి ప్రపంచంలో అక్కినేని మాత్రమే.