Akhanda Box Office Collection: సినిమాను ఆస్వాదించడంలో... తారల్ని అభిమానించడంలో... తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అనే మాటల్ని తరచూ వింటుంటాం. కొత్త సినిమా విడుదలైందంటే చాలు... థియేటర్ల దగ్గర ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక అది అగ్ర తారల సినిమా అయితే ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. వసూళ్లు... రికార్డులు అంటూ వారం రోజులపాటు అభిమానుల్లోనూ, పరిశ్రమ వర్గాల్లోనూ ప్రత్యేకమైన హంగామా కనిపిస్తుంది. కరోనా దెబ్బతో ఆ జోరు.. హుషారు కనిపించక చాలా రోజులైంది. లాక్‌డౌన్‌లతో చిత్రసీమ కుదేలైంది. కొన్ని సినిమాలు ఏళ్ల తరబడి సెట్స్‌పై ఉండిపోయాయి. ఇక థియేటర్ల ముందుకొచ్చిన వాటి సంగతి సరే సరి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా 'అఖండ' తొలి ఆట నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టింది. వసూళ్లతో బాక్సాఫీసుకు ఊపును తీసుకొచ్చింది.
రెండో లాక్‌డౌన్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా 'అఖండ'నే కావడం... తదుపరి వరుసగా అగ్ర తారల చిత్రాలు వరుసలో ఉండటం వల్ల అందరి దృష్టి బాలయ్యపైనే పడింది. దీంతో బాక్సాఫీస్‌కు మాస్ ప్రేక్షకుల తాకిడి పెరగాలని, ఆ ఊపు అలా కొనసాగాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. 'అఖండ' ఆ కోరికని నెరవేర్చే పనిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.63 కోట్లకిపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఆదివారం హాళ్లు దాదాపుగా హౌస్‌ఫుల్ బోర్డులతో రన్ అయినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. పలు ప్రాంతాల్లో బాలకృష్ణ గత సినిమాలు సాధించిన రికార్డుల్ని తుడిచేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పక్కా మాస్ సినిమా కావడం, విజయవంతమైన బాలకృష్ణ - బోయపాటి కలయికలో సినిమా కావడం 'అఖండ'కు కలిసొచ్చింది.