విశాల్ దేవ్‌గణ్...ఈ పేరుతో బాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారా? అనడిగితే కాస్త తికమక పడొచ్చు. కానీ, అజయ్ దేవ్‌గణ్ అనగానే టుక్కున అతడి రూపం కళ్లలో మెదలడంతో పాటు అతను నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులు ఇట్టే గుర్తొస్తాయి. ఒకటా రెండా? 1985లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాది డైరెక్టర్ బాపు దర్శకత్వంలో 'కాళీ చరణ్' సినిమా చేసిన అజయ్ దేవ్‌గణ్ పూర్తి స్థాయి కథానాయకుడిగా 1991లో 'ఫూల్ అర్ కాంటే' సినిమా ద్వారా ట్రాక్ లోకి వచ్చాడు.
అప్పటినుంచి ఇప్పటి వరకూ విరామం లేకుండా నటిస్తూ హీరోగా తన స్టామినా చాటుకుంటూనే ఉన్నాడు. వెండితెర పైనే కాకుండా కొన్ని టెలివిజన్ షోలలోనూ సందడి చేశాడు. కొన్ని చిత్రాలకు దర్శకుడిగా.. మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తనకంటూ క్రేజ్, ఇమేజ్ తెచ్చుకున్నాడు.
శతచిత్ర కధానాయకుడు
అజయ్ దేవ్‌గణ్ శత చిత్ర కథానాయకుడు. సుదీర్ఘంగా సాగిన సినీ యానంలో అతను అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు 2016లో భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. 1991లో మొదటి సినిమా 'ఫూల్ అర్ కాంటే'తోనే బెస్ట్ మేల్ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా వరించి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విజయాల మజిలీలు ఎన్నింటినో దాటాడు. 1992లో 'జిగర్', 1993లో 'సంగ్రామ్', 1994లో 'విజయ్ పద్', అదే సంవత్సరం 'దిల్ వాలే', 'సుహాగ్', 1995లో 'నాజియాజిర్', 1996లో 'దిల్ జలే', 1997లో 'ఇష్క్', 1998లో మహేష్ భట్ సినిమా 'జకం' చిత్రాల్లో నటించాడు.
'జకం' చిత్రానికి ఉత్తమ నటుడిగా మొట్టమొదటిసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ డ్రామాల స్పెషలిస్ట్ అయిన సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'హమ్ దిల్ దే చుకే సనమ్' ద్వారా అజయ్ దేవ్‌గణ్ అందుకున్న ఖ్యాతి అంతా ఇంతా కాదు. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా అతడి గురించే మాట్లాడుకున్నారు. ఈ చిత్రంలో వనరాజ్ పాత్రలో కనిపించిన అజయ్ దేవ్‌గణ్ తను పెళ్లి చేసుకున్న భార్యని ఆమె లవర్‌తో కలిపేందుకు ప్రయత్నించడం...ఆ ప్రయత్నంలో నటుడిగా అతడు పండించిన భావోద్వేగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
2000 సంవత్సరం ప్రారంభంలో అజయ్ దేవ్‌గన్ నటించిన రాంగోపాల్ వర్మ సినిమా 'కంపెనీ'లో గ్యాంగ్ స్టర్ పాత్ర విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది. ఈ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడిగా అజయ్ దేవ్‌గణ్ ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2003లో 'దివాన్ జీ' అనే చిత్రంలో నటనకుగాను ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నాడు. 'ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్' చిత్రం ద్వారా అతడు రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఓ పక్క క్లిష్టమైన పాత్రల్లో నటిస్తూ.. మరో పక్క కమర్షియల్ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.