జంధ్యాల దర్శకత్వం వహించిన 'అహ నా పెళ్లంట' చిత్రం గుర్తుందా! అందులో కోట శ్రీనివాసరావు పోషించిన లక్ష్మీపతి పాత్రను అంత త్వరగా మర్చిపోలేం. పిసినారిగా ఆయన పండించిన హాస్యానికి నవ్వని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! నిజానికి ఆ పాత్రకు ముందు అనుకున్నది కోట శ్రీనివాసరావును కాదంట. రావుగోపాలరావుతో లక్ష్మీపతి పాత్ర చేయించాలని నిర్మాత రామానాయుడు అనుకున్నారంట.
సినీడైరీ: పిసినారి పాత్రలో కోట కాదు.. రావు! - lakshmipathi
'అహ నా పెళ్లంట' సినిమాలో లక్ష్మీపతి పాత్రకు ముందు కోట శ్రీనివాసరావును అనుకోలేదంట నిర్మాత. రావుగోపాలరావుతో ఆ పాత్ర చేయించాలనుకున్నారంట. దర్శకుడు పట్టుదలతో కోటకు ఆ పాత్ర వచ్చింది.
ఎందుకంటే అప్పటికి కోట శ్రీనివాసరావు అంత గుర్తింపు తెచ్చుకోలేదు. కథలో కీలకమైన లక్ష్మీపతి పాత్రను గుర్తింపున్న నటుడితో చేయిస్తే బాగుంటుందని నిర్మాత అభిప్రాయం. అయితే దర్శకుడు జంధ్యాల పట్టుబట్టి కోటను ఎంపిక చేశారు. ఈ సినిమాలో కోట అద్భుతంగా నటించి దర్శకుడి నమ్మకాన్ని వమ్ముకానివ్వలేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కోట శ్రీనివాసరావే స్వయంగా పంచుకున్నారు.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా, రజినీ హీరోయిన్గా చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు భారీ హిట్ చేశారు. రూ.16లక్షలతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.5 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాతోనే హస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గుర్తింపు తెచ్చుకున్నారు.