Ketika sharma about Lakshya movie: "నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే తొలి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు. నటిగా ప్రతీ భాషలోనూ నటించాలనుంది. అన్ని రకాల పాత్రలు పోషించాలనుంది" అంటోంది కేతిక శర్మ. 'రొమాంటిక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దిల్లీ అందం ఆమె. ఇప్పుడు 'లక్ష్య'తో అలరించేందుకు సిద్ధమైంది. నాగశౌర్య కథా నాయకుడిగా నటించిన చిత్రమిది. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో చిత్ర విశేషాలను తెలిపింది కేతిక శర్మ.
'కొవిడ్ పరిస్థితుల వల్లే నా సినిమాలన్నీ కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడవన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందాన్నిస్తోంది. 'రొమాంటిక్' చిత్రీకరణ ఆఖరి రోజునే.. దర్శకుడు సంతోష్ నాకు 'లక్ష్య' కథ వినిపించారు. ఇలా ఓ చిత్రం పూర్తికాగానే.. అలా మరో అవకాశం రావడం ఆనందంగా అనిపించింది. నా పాత్ర.. తొలి చిత్రంలో పోషించిన మౌనిక రోల్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ వైవిధ్యం వల్లే నేనీ సినిమా ఒప్పుకొన్నా. దీనికి తోడు విలువిద్య నేపథ్యంలో ఇంత వరకు పెద్దగా సినిమాలు రాలేదు. అది మన ప్రాచీన ఆట. పురాణాల్లోనూ ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. అందుకే కథ వినగానే.. కచ్చితంగా చేయాలనిపించింది".
"ఈ సినిమాలో నేను రితిక అనే పాత్ర పోషించా. మనసుకు నచ్చినట్లుగా జీవించే అమ్మాయి తను. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. అలాగే చాలా ఎమోషనల్. పెళ్లి చేసుకోవాలని తాపత్రయ పడుతుంటుంది. కథ మొత్తం నాగశౌర్య చుట్టూనే తిరుగుతుంటుంది. ఆయనిందులో పార్థు అనే పాత్రలో కనిపిస్తారు. శౌర్య చాలా కష్టపడ్డారు. వృత్తిపట్ల అంత నిబద్ధతతో వ్యవహరించే నటుడితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నేనెంతో మంది ఆర్చర్లను కలిశాను. కొంచెం నేర్చుకున్నాను".