తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెరపై తారగా.. రాజకీయాల్లో రాణిగా!

రోజా అనగానే ఎవరికైనా మొదట ఆమె నవ్వే గుర్తుకొస్తుంది. ఆ నవ్వుతోనే మాయ చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​గా, విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

Actress Roja Selvamani birthday special story
వెండితెరపై తారగా.. రాజకీయాల్లో రాణిగా

By

Published : Nov 17, 2020, 5:30 AM IST

ఇటు వెండితెర...అటు రాజకీయ తెరపై రాణిస్తూ ఇప్పటికీ వార్తల్లో ఉన్న వ్యక్తి రోజా. ఎంచుకున్న రెండు రంగాల్లోనూ అప్పటివరకు ఉన్న హద్దులు చెరిపేసి... తన స్వత్రంత శైలిలో ముందుకు దూసుకుపోయిన ఆమె నైజమే... ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకంజ వేయకపోవడం.. రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఏ స్థాయి వారైనా తీవ్రభాషలో రెచ్చిపోవడం.. రోజా స్టయిల్‌. చిత్రసీమలో తొలినాళ్లలో ఐరన్‌ లెగ్‌ అనిపించుకున్నప్పటికీ... విజయాల్ని అందుకుని ఆ పేరు తుడిపేసుకున్నారు. రాజకీయ రంగంలోనూ అదే రీతిలో మొదట్లో పేరు పొందినా ఇప్పుడు విజయం సాధించారు. మంగళవారం (నవంబరు 17) ఈమె పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.

అసలు పేరు శ్రీలత

రోజా అసలు పేరు శ్రీలత. 1972 నవంబర్‌ 17న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు‌ జిల్లాలో నాగరాజరెడ్డి, లలిత దంపతులకు జన్మించారు. రోజాకు కుమారస్వామి రెడ్డి, రామప్రసాద్‌ రెడ్డి సోదరులు. కొన్నాళ్ల తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. రోజా కూచిపూడి నాట్యం నేర్చుకుని సినిమాల్లోకి రాకముందు ప్రదర్శనలు ఇస్తుండేవారు.

రోజాగానే సినిమా పరిశ్రమలో తెలుగుప్రేక్షకులకు బాగా తెలుసు. 'సీతారత్నంగారి అబ్బాయి' సినిమాలోని 'ఇత్తడైపోద్ది' అన్న డైలాగుతో బాగా పాపులర్‌ అయ్యరు. 1991 నుంచి 2002 వరకు గల సినిమాలలో పలు పేరున్న హీరోల సరసన నటించారు. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మరింత పేరు తెచ్చుకుని అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ ప్రేక్షకాదరణతోనే ఇప్పటికీ టీవీ ఛానెల్లో పలు షోలకు న్యాయనిర్ణేతగాను వ్యవహరిస్తున్నారు.

సినీ ప్రయాణం

తెలుగు సినిమాతో చిత్రసీమకు పరిచయమయ్యారు రోజా. 'సర్పయాగం' సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చారు రోజా. రాజేంద్ర ప్రసాద్‌తో 'ప్రేమ తపస్సు' సినిమా రోజాకు తెలుగులో రెండో సినిమా. ఈ సినిమా షూటింగ్‌ పూర్తిగా తిరుపతిలో జరిగింది. ఆమె 1991 నుండి 2002 వరకు దక్షిణ భారత సినిమాల్లో ప్రముఖ నటిగా రాణించారు. అలాగే, తమిళ, తెలుగు పరిశ్రమల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందారు.

రోజాను తమిళ సినిమా పరిశ్రమకు ఆర్‌.కె.సెల్వమణి పరిచయం చేశారు. సెల్వమణి దర్శకత్వంలో ప్రశాంత్, రోజా హీరోహీరోయిన్లుగా 'చెంబరుతి' అనే సినిమాలో నటించారు. రోజాకు తమిళంలో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా విజయం అందుకుంది. దాంతో తమిళ్​లో శరత్‌ కుమార్‌తో 'సురియన్‌' అనే సినిమాలో రోజాకు అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా విజయవంతమైంది. ఈ రెండు సినిమాలతో తమిళ పరిశ్రమలో హీరోయిన్‌గా రోజా నిలిచిపోయారు. విజయవంతమైన 'ముఠా మేస్త్రి', 'భైరవ ద్వీపం', 'బొబ్బిలి సింహం', 'అన్నమయ్య', 'అన్న', 'పెద్దన్నయ్య', 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'శుభలగ్నం', 'శ్రీ కృష్ణార్జున విజయం' వంటి ఎన్నో సినిమాలలో రోజా నటించారు. ఆ తర్వాత 'శంభో శివ శంభో', 'గోలీమార్‌', 'మొగుడు', 'కోడి పుంజు', 'వీర' వంటి సినిమాలలో ఆమె సహాయక పాత్రలలో నటించారు.

రోజా చేసిన మరికొన్ని తెలుగు సినిమాలు

'అత్తకు కొడుకు మామకు అల్లుడు', 'అత్త సొమ్ము అల్లుడి దానం', 'మొగుడుగారు', 'ముగ్గురు మొనగాళ్లు', 'పోలీస్‌ బ్రదర్స్‌', 'శుభలగ్నం', 'బిగ్‌ బాస్‌', 'మాతో పెట్టుకోకు', 'మాయ బజార్‌', 'పోకిరి రాజా', 'ఘటోత్కచుడు', 'టోపీ రాజా స్వీటీ రోజా', 'వజ్రం', 'స్వర్ణక్క', 'మీ ఆయన జాగ్రత్త', 'సుల్తాన్‌', 'తిరుమల తిరుపతి వెంకటేశా', 'ఫ్యామిలీ సర్కస్‌', 'దుర్గ', 'సమ్మక్క సారక్క', 'పరమ వీర చక్ర', 'కోడిపుంజు', 'శ్రీరామ రాజ్యం', 'పవిత్ర' తదితర సినిమాలలో నటించారు రోజా.

రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, విష్ణువర్ధన్, రవిచంద్రన్, కృష్ణ, మమ్మూట్టి, శరత్‌ కుమార్, అక్కినేని నాగార్జున, శ్రీకాంత్, విజయకాంత్, మురళి, అజిత్‌ కుమార్, సత్యరాజ్, ప్రభు, కార్తీక, ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం, వెంకటేశ్​ వంటి అగ్ర కథానాయకులతో రోజా స్కీన్ర్‌ షేర్‌ చేసుకొన్నారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమలలో మొత్తం 100 సినిమాలపైగా నటించారు.

రాజకీయ జీవితం

రోజా 1999లో తెలుగుదేశంలో చేరారు. ఆ పార్టీ తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె 2009 ఏపీ రాష్ట్ర ఎన్నికలలో ఓడిపోయారు. 2009లో టీడీపీని వదిలి రోజా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమె నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె మరోసారి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్ళీ సీటును గెలుచుకున్నారు. రోజాను ఎపిఐఐసి చైర్మన్‌గా నియమించారు.

బుల్లితెరపై

'మోడరన్‌ మహాలక్ష్మి' అనే షోకు రోజా యాంకర్‌గా వ్యవహరించారు. ఈటీవీలో ప్రసారమవుతోన్న 'జబర్దస్త్‌' కార్యక్రమానికి ఓ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జీ తమిళ్‌లో రోజాపై 'లక్కా కిక్కా' అనే షోను రోజా హోస్ట్‌ చేశారు. తమిళనాడులో ఈ షో భారీ విజయం అందుకొంది. కుటుంబ సమస్యలు పరిష్కరించే టీవీ షో 'బతుకు జట్కాబండి'కి హోస్ట్‌గా వ్యవహరించారు.

వ్యక్తిగతం

తమిళ సినిమా దర్శకుడైన ఆర్‌.కె.సెల్వమణిని రోజా 2002, ఆగష్టు 10న వివాహమాడారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

పురస్కారాలు

  • 1991లో 'సర్పయాగం' సినిమాకు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకొన్నారు.
  • 1994లో 'అన్న' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును సంపాదించుకున్నారు.
  • 1998లో 'స్వర్ణక్క' చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు.
  • 'ఉన్నిదతిల్‌ ఎన్నై కొడుతేన్‌' అనే తమిళ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చిత్ర పురస్కారాన్ని 1998లో అందుకొన్నారు. ఇదే సినిమాకు ఉత్తమ నటిగా సినిమా ఎక్సప్రెస్‌ తమిళ్‌ పురస్కారాన్ని సొంతం చేసుకోగలిగారు.
  • 2013లో 'మోడరన్‌ మహాలక్ష్మి' అనే టీవీ షోకు ఉత్తమ యాంకర్‌గా మాటీవీ అవార్డును అందుకొన్నారు.
  • 2018లో ఎవర్​గ్రీన్​ హీరోయిన్‌గా జీ తెలుగు అప్సర అవార్డును రోజా అందుకొన్నారు.

ABOUT THE AUTHOR

...view details