తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఎక్స్ 100'కు గుర్తుగా పాయల్​ ఇంటిపై బైక్ - పాయల్ రాజ్​పూత్ ఆర్​ఎక్స్ 100

హీరోయిన్​గా పాయల్ రాజ్​పూత్ సక్సెస్​ కావడం వెనుక ఆమె ఆరేళ్ల కష్టం ఉందని చాలామందికి తెలియదు. అలానే టాలీవుడ్​ హిట్​ వచ్చిన తర్వాత కాంప్రమైజ్​ అవ్వమని పలువురు అడిగారంటూ ఆమె చెప్పింది. దీనితో పాటు గతంలో వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.. పాయల్ పుట్టినరోజు సందర్భంగా మీకోసం.

actress payal rajput birthday special
పాయల్ రాజ్​పూత్ పుట్టినరోజు

By

Published : Dec 5, 2020, 9:39 AM IST

అది 2018 జులై 12.. 'ఆర్‌ఎక్స్‌ 100' థియేటర్‌లో విడుదలైంది. సినిమా హిట్‌.. అందాల విందుతోపాటు అభినయం ప్రదర్శించిన పాయల్‌ రాజ్‌పూత్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 'నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సాధించింది..' అనుకున్నారు. కానీ ఆమె విజయం వెనుక ఆరేళ్ల కష్టం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. పాయల్‌ 2010లోనే నటిగా కెరీర్‌ ఆరంభించారు. ఉత్తమ అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. చివరికి టాలీవుడ్‌ గూటికి చేరారు. శనివారం(డిసెంబరు 5) ఈ భామ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం...

పాయల్‌ది పంజాబీ కుటుంబం. పుట్టి, పెరిగింది దిల్లీలో. ఆమె తల్లిదండ్రులు టీచర్లు. పాయల్‌ నాలుగేళ్ల వయసులోనే ముఖానికి రంగేసుకున్నారు. పలు పంజాబీ సీరియళ్లలో నటించారు. ఆమె తల్లికి యాంకరింగ్‌ అంటే ఆసక్తి ఉండేదట. అదే పాయల్‌ను బాలనటిగా మార్చింది. బుల్లితెరతో ఉన్న అనుబంధం వల్ల ఈ భామ జర్నలిజంలో డిగ్రీ పూర్తయ్యాక యాంకరింగ్‌ చేసింది. కళాశాల రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాతే ఆమెలో సినిమాల్లో నటించాలనే ఆశ పెరిగింది.

హీరోయిన్ పాయల్ రాజ్​పుత్

రూ.లక్ష పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టింది. ఎన్నో ప్రకటనల్లో నటించడం సహా వ్యాఖ్యాతగా పనిచేయడం వల్ల వచ్చిన డబ్బు అది. దాంతోనే తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమైంది. తెలుగు, తమిళ చిత్ర సీమల్లో ఎన్నో ఆడిషన్లకు హాజరైంది. ప్రతిచోటా తిరస్కారాలే ఎదురయ్యాయి. కొందరు ఆమె ముఖం దక్షిణాది సినిమాలకు పనికిరాదని చెప్పారు. 2010లో 'సప్నోన్ సే భరే నైనా' ధారావాహికలో 'సోనాక్షి'గా పనిచేసే అవకాశం లభించింది. 'ఆఖిర్ బాహు భీ తోహ్ బేటి హీ హై', 'గుస్తాక్‌ దిల్‌', 'మహాకుంభ్‌' తదితర సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించే ఆఫర్‌ దక్కించుకుని, బుల్లితెర నటిగా రాణించింది.

సీరియల్ నటిగా పాయల్ రాజ్​పూత్

ఎట్టకేలకు కథానాయికగా పాయల్‌ కెరీర్‌ ఆరంభమైంది. పంజాబీ చిత్రం 'చన్నా మేరేయా'తో అరంగేట్రం చేశారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటిగా (పరిచయం) ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. హిందీ సినిమా ‘వీరే కీ వెడ్డింగ్‌’లో చిన్న పాత్రలో కనిపించారు. ఆపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి తీయబోతున్న తెలుగు సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ఆర్​ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్​పుత్

రెగ్యులర్‌ సినిమాలు చూసేవారు ‘ఆర్‌ఎక్స్‌ 100’ చూడొద్దని కామెంట్ చేసి అందరి దృష్టిలోపడ్డారు అజయ్‌ భూపతి. ఆయన మాటలు, చిత్రం ట్రైలర్‌ ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకెళ్లాయి. ప్రియుడ్ని మోసం చేసిన ప్రేయసి కథతో తీసిన వైవిధ్య చిత్రాన్ని ప్రజలు ఆదరించారు. తొలిసారి తెలుగు వారిని పలకరించిన పాయల్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆమె చూపులు కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్నాయి. రాత్రికి రాత్రి ఆమె సినీ స్టార్‌ అయిపోయారు. ఉత్తమ నటిగా (అరంగేట్రం) సైమా పురస్కారం అందుకున్నారు. ‘వెంకీ మామ’ (2019), ‘డిస్కో రాజా’ (2020) సినిమాలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే పలు పంజాబీ సినిమాల్లోనూ నటించారు. ఇటీవల విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’లో డీగ్లామర్‌ లుక్‌, బలమైన పాత్రతో అలరించారు. ఆమె తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించిన ‘ఏంజెల్‌’ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

హీరోయిన్ పాయల్ రాజ్​పుత్

‘ఆర్‌ఎక్స్‌ 100’కి ముందు ఎంతో అభద్రతాభావంతో ఉన్నానని ఓ సారి పాయల్‌ చెప్పారు. ‘బుల్లితెర నటిగా ఉన్నప్పుడు నా కెరీర్‌ గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. హీరోయిన్‌ కావాలనేది నా కల.. అది నెరవేర్చుకునే మార్గాలు అప్పట్లో కనిపించలేదు. ఎంతో భయపడ్డాను. ఓ పక్క సీరియల్స్‌లో నటిస్తున్నా, అవి టీవీలో ప్రసారం అవుతున్నాయి. అయినా సరే ఇబ్బందులు పడ్డా. ముంబయి మహానగరంలో ఖర్చులు ఎక్కువ. ఇంటి అద్దె నుంచి అన్నీ భరించాలి. ఈ నెల నటించా, అద్దె కట్టేశా.. వచ్చే నెల పరిస్థితి ఏంటని బాధపడుతూ ఉండేదాన్ని..’ అన్నారామె.

‘తెలుగు సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్‌ ఏర్పడింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో నా పాత్ర వల్ల కొందరు నిజ జీవితంలోనూ నన్ను చూసి భయపడుతున్నారు. ఈ చిత్రంతో వచ్చిన డబ్బులతో ముంబయిలో ఓ ఇల్లు కొన్నాను. ఆ ఇంటిపైన ‘ఆర్‌ఎక్స్‌ 100’కు గుర్తుగా ఓ బైక్‌ కూడా పెట్టుకున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నా. అమ్మానాన్నల్ని మిస్‌ అవుతున్నా..’ అని ఓసారి పాయల్‌ పేర్కొన్నారు.

హీరోయిన్ పాయల్ రాజ్​పుత్

ఈ భామ జీవితంలోనూ ప్రేమకథ ఉంది. ‘నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక దశలో ప్రేమలో పడే ఉంటారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలోపడ్డా. ఆ అబ్బాయి పేరు చెప్పను, చాలా అందంగా ఉండేవాడు. దూరం నుంచి చూస్తూ ఇష్టపడేదాన్ని. ఎప్పుడూ మాట్లాడలేదు. పన్నెండో తరగతి వరకు కలిసే చదువుకున్నాం. కానీ ఎప్పుడూ నా ప్రేమను బయటపెట్టలేదు. ఇప్పుడు ప్రేమించే తీరకలేదు..’ అని పాయల్‌ చెప్పారు.

టాలీవుడ్‌ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ ఓ సారి పాయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగులో క్యాస్టింగ్‌ కౌచ్‌ కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా నిరాశకు గురి చేసింది. నాకు హిట్‌ వచ్చిన తర్వాత కూడా కాంప్రమైజ్‌ అవ్వమని అడుగుతున్నారు. నేను షాక్‌ అయ్యా. బహుశా ‘ఆర్‌ఎక్స్‌ 100’లో బోల్డ్‌ పాత్ర చేయడం వల్లా అనుకుంటా. నాకు నైపుణ్యం ఉంది, నా శ్రమని నమ్ముతాను’ అని పేర్కొన్నారు.

అమ్మనాన్నతో హీరోయిన్ పాయల్ రాజ్​పూత్

ABOUT THE AUTHOR

...view details