ఎనిమిదేళ్లకే నటన ప్రారంభించి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ యువనటి పురస్కారం అందుకుంది. మలయాళం, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్.. ఏ భాషైనా మాడ్లాడగలుగుతుంది. యువతతో 'నిన్ను కోరి ఎగసే నా ఊపిరి' అని పాడించుకుంటుంది. ఇప్పటికే ఈ భామ ఎవరో తెలిసిపోయిందనుకుంటా! అవును. ఆమే నివేదా థామస్. నేడు (నవంబరు 2) ఆమె పుట్టినరోజు సందర్భంగా నివేదా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
వ్యక్తిగతం
1995 నవంబరు 2న ఇల్లీ థామస్, జబూ థామస్ దంపతులకు నివేదా థామస్ జన్మించారు. కేరళలోని కన్నూర్ ఆమె స్వస్థలం. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్లో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందింది.
బాలనటిగా
2002లో మలయాళ చిత్రం 'ఉత్తర'తో బాటనటిగా నివేదా థామస్ తెరంగ్రేటం చేసింది. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన పలు ధారావాహికల్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. 'వెరుథె ఒరు భార్య' అనే మలయాళం చిత్రంలో నటుడు జయరాం కుమార్తె పాత్రలో ఒదిగిపోయింది నివేదా. ప్రశంసలతోపాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ యువనటి అవార్డు అందుకుంది. 'పాపనాసం' అనే తమిళ చిత్రంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు కూతురుగా నటించింది. ఇలా మలయాళ, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ 2016లో కథానాయికగా తెలుగుతెరకు పరిచయమైంది.