'ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..!' అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో 'సీత'గా సుస్థిరస్థానం సంపాదించుకుంది అంజలి. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు ఈమె మాత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో 'సీత'గానే గుర్తుండిపోతుంది. గతంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో హాజరైన అంజలి.. సినీ కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
వెంటపడుతున్నాడని రాఖీ కట్టింది
అంజలి అసలు పేరు బాలా త్రిపుర సుందరి. అది తన నానమ్మ పేరు అని.. కానీ, ఆ పేరుతో ఎవరు పిలవరు అని చెప్పింది. తన నానమ్మ ముద్దుపేరు బేబి కావడం వల్ల తనను బేబి అని పిలిచేవారని తెలిపింది. కాలేజీ రోజుల్లో తన వెంటపడిన అబ్బాయికి రాఖీ కట్టినట్లు వెల్లడించింది.
సేల్స్‌గర్ల్‌గా
అంజలి హీరోయిన్గా చేసిన తొలి చిత్రం 'షాపింగ్‌మాల్'. దీని షూటింగ్ కోసం సేల్స్‌గర్ల్‌గా పనిచేసినట్లు ఆమె తెలిపింది. "ఓ షాప్‌లో పనిచేసే సేల్స్‌గర్ల్ - సేల్స్‌బాయ్ మధ్య జరిగే ప్రేమ కథే ఈ సినిమా. దాని కోసం ఓ సెట్ వేశారు. అందులో 80 రోజులు షూటింగ్ చేశాం. కొనసాగింపుగా రంగనాథ స్ట్రీట్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. దీంతో దర్శకుడు నాకు కొన్ని వస్తువులు ఇచ్చి జనాల్లో కలిసిపోయి అమ్ముకుని రమ్మన్నారు. అప్పటికి నేను కేవలం ఒక్క సినిమాలోనే నటించి ఉండటం వల్ల ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో నేను ఆ వస్తువులను అమ్మాను. సినిమాలోని సన్నివేశాలు రియలస్టిక్ ఉండటం కోసమే అలా చేశారు. దాదాపు వారం రోజులు పాటు ఇలాగే నాపై సీన్స్ తీశారు" అని అలీతో అంజలి చెప్పింది.