గత కొద్దిరోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కోర్టు వివాదాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోలు ట్యాక్స్ చెల్లించే విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది.
ఏం జరిగిందంటే?
విశాల్ హీరోగా తెరకెక్కిన 'చక్ర' సినిమాపై కాపీరైట్స్ ఆరోపణలు చేస్తూ.. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణసంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ నిర్మాణసంస్థ రూపొందించాల్సిన చిత్రాన్ని హీరో విశాల్ నిర్మించాడని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. లైకా ప్రొడక్షన్స్ చేసినవి అసత్య ఆరోపణలని తేల్చి చెప్పింది. దీంతో పాటు సదరు నిర్మాణసంస్థకు కోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుపై ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు హీరో విశాల్. "న్యాయం గెలుస్తుందని.. నిజమే విజయం సాధిస్తుందని నేనెప్పుడూ నమ్ముతుంటాను. నాతో సహా చక్ర సినిమాపై లైకా ప్రొడక్షన్స్ నమోదు చేసిన తప్పుడు కేసును గౌరవనీయమైన మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అసత్య ఆరోపణలు చేయడం సహా నన్ను వేధించిన కారణంగా ఆ నిర్మాణసంస్థకు రూ.5 లక్షల జరిమానాను న్యాయస్థానం విధించింది" అని అన్నారు.
ఇదీ చూడండి..స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి కష్టమేనా?