తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాని చెప్పిందే జరుగుతుందని ఊహించలేదు'

సూపర్​స్టార్​ కృష్ణ అల్లుడిగా వెండితెరకు పరిచయమై.. నటనలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్​బాబు. తొలి చిత్రం 'శివ మనసులో శ్రుతి' నుంచి గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వీర భోగ వసంతరాయలు' వరకు తనదైన నటనతో సినీ అభిమానులకు చేరువయ్యారు. నేడు (మే 11) సుధీర్​బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ.

Actor Sudheer Babu Birthday Special Story
'నాని చెప్పిందే జరుగుతుందని ఊహించలేదు'

By

Published : May 11, 2020, 10:22 AM IST

Updated : May 11, 2020, 10:39 AM IST

యువ కథానాయకుల్లో సుధీర్‌బాబు పంథా ప్రత్యేకం. తన నటనతో అలరిస్తారు. ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరుస్తారు. 'బాఘీ'లో ఈ హీరో కండలు చూసి బాలీవుడ్‌ ప్రేక్షకులూ ఫిదా అయిపోయారు. ప్రముఖ కథానాయకుడు కృష్ణ అల్లుడిగా వెండితెరకు పరిచయమయ్యారు సుధీర్‌. కానీ తనశైలి నటనతో ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసి, మామకి తగ్గ అల్లుడు అనిపించుకున్నారు. తాజాగా 'వి' చిత్రంలో నానితో కలసి నటించారు. నేడు (మే 11) సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ.

ఈసారి మీ పుట్టినరోజు వేడుకలు ఇంట్లోనేనా?

పుట్టినరోజు వేడుక ఆర్భాటంగా చేసుకోవడం అలవాటు లేదు. హీరో అయ్యాకే అభిమానుల సందడి మధ్య వేడుకలు జరుపుకుంటున్నా. ఈసారి లాక్‌డౌన్‌ కాబట్టి ఇంట్లోనే ఉంటా. నా పుట్టినరోజు 11న అయితే, 10న మా అబ్బాయిది. దాంతో నాకంటే, వాడి పుట్టినరోజు సందడే ఎక్కువగా ఉంటుంది.

సుధీర్​బాబు

'వి' విడుదలకి కాస్త ముందే కరోనా ప్రభావం మొదలైంది. నిరుత్సాహానికి గురయ్యారా?

ఒకవేళ విడుదలయ్యాక ఒకట్రెండు రోజులకి కరోనా ప్రభావం మొదలయ్యుంటే ఇంకా ఇబ్బంది పడేవాళ్లం. కాస్త ఆలస్యమైనా, మా సినిమా ఇంకా ఎక్కువమందికి చేరువవుతుందని మా నమ్మకం. మా సినిమా గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు. ఉచిత ప్రచారం లభిస్తోంది. ప్రేక్షకులు కొన్నాళ్లుగా ఓటీటీల్లో సినిమాలు చూస్తూ, థియేటర్‌ అనుభూతికి దూరమయ్యారు. దాని కోసం లాక్‌డౌన్‌ తర్వాత వాళ్లంతా థియేటర్‌కి వస్తారు. 'బాహుబలి' తర్వాత ఎలాగైతే ఒక వేవ్‌ వచ్చిందో, అలా లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని చిత్రాలకి అనూహ్యమైన వసూళ్లొస్తాయని నా నమ్మకం.

'వి' చిత్రాన్ని ఓటీటీల్లో విడుదల చేసే విషయంపై మీ మధ్య చర్చలు కూడా జరిగాయట కదా?

చర్చలు జరిగిన మాట నిజమే. కానీ 'వి' పెద్ద తెర మీద చూడాల్సిన సినిమా. ఆ నాణ్యతకి తగ్గట్టుగా ఖర్చు పెట్టి తీశారు నిర్మాతలు. అలాంటి సినిమాని టీవీల్లో, ఐ ప్యాడ్‌లో చూస్తే ఒక మంచి అనుభూతిని కోల్పోయినట్టే. సినిమా అంటే డబ్బు ఒకటే కాదు, వృత్తిపరమైన సంతృప్తి కూడా. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఉత్తరాది సాంకేతిక నిపుణుల్ని తీసుకొచ్చి సౌండ్‌ ఎఫెక్ట్స్‌ చేయించారు. ఇలాంటి సినిమాని ఓటీటీకి పరిమితం చేయడం సరైంది కాదనుకున్నాం. తొలి సగ భాగం వరకు ఓటీటీకి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనా వచ్చింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే తరహాలో థ్రిల్లర్‌ అంశాలు సినిమాలో ఉంటాయి. నాని, నేను, దర్శకనిర్మాతలు... అందరం ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించాం. పైగా మనం ఓటీటీలో విడుదల చేస్తే, మిగతావాళ్లు అదే దారిలోనే వెళతారు కదా అనుకున్నాం. సినిమా ఓటీటీ, శాటిలైట్‌ మీదే ఆధార పడటం మంచిది కాదు. ఓటీటీ బడ్జెట్‌ చాలా తక్కువ. బడ్జెట్‌ తగ్గేకొద్దీ సినిమా నాణ్యత తగ్గుతుంది. సినిమాకు థియేటర్లు చాలా ముఖ్యం.

'వి'లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

నేను పోలీసు అధికారిగా కనిపిస్తా. మోహనకృష్ణ సినిమా అంటే రచనకు ప్రాధాన్యం ఉంటుంది. ఆయన డ్రామాకు పెద్ద పీట వేస్తారు. యాక్షన్‌ జోనరే అయినా, చక్కటి డ్రామా ఉంటుంది. నానికీ, నాకూ మధ్య సంభాషణలు, మా మధ్య సవాళ్లు ఆకట్టుకుంటాయి.

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు సెట్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?

ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు, అపోహలు వినిపిస్తుంటాయి. ఒక మంచి కథైతే చాలు, అందులో ఏ పాత్రా ఎక్కువ, తక్కువ కాదు. 'మీ సినిమాలో మరో హీరో నాని ఉన్నాడు కదా, మీ పాత్ర ఎంత ఉంటుంది? ఎవరూ చేయకపోవడం వల్ల మీ దగ్గరికి వచ్చిందా?' ఇలాంటి ప్రశ్నలు నాకూ ఎదురయ్యాయి. దర్శకుడు మొదటిసారి కథ చెప్పినప్పుడే నేను ఈ పాత్ర చేస్తే బాగుంటుందనుకున్నా. అదే నా దగ్గరికొచ్చింది. ఇక ప్రాధాన్యత విషయానికొస్తే... ఇద్దరూ ఒకటే పాత్ర చేయడం లేదు కదా. ఎవరి పాత్రలు వాళ్లకుంటాయి కాబట్టి, వాళ్ల పాత్రలపై దృష్టి పెట్టి చేయడమే. నటుడిగా నిరూపించుకునేంత పరిధి ఆ పాత్రలో ఉంటే చాలు, తప్పకుండా పేరొస్తుంది. సెట్‌లో వాతావరణం కూడా అన్ని సినిమాల్లో ఎలా ఉంటుందో ఇందులోనూ అంతే.

లాక్‌డౌన్‌లో ఇంట్లో ఎలా గడుపుతున్నారు?

కుటుంబంతో మరింత సమయం గడుపుతున్నా. ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం ఎలాగో, నటనకు ప్రాక్టీస్‌ ముఖ్యమని నమ్ముతా. అందుకే ఖాళీ సమయాల్లో మంచి చిత్రాల్లోని సన్నివేశాల్ని ఎంచుకుని ప్రాక్టీస్‌ చేస్తుంటా. పిల్లలతో వ్యాయామం చేయించడం, వాళ్లతో ఫుట్‌బాల్‌ ఆడటం.. ఇలా సమయం తెలియకుండానే గడిచిపోతోంది.

పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఎప్పుడు?

లాక్‌డౌన్‌ తర్వాత మొదలు పెట్టాలి. అలాగే 70 ఎమ్‌.ఎమ్‌ సంస్థ నిర్మించే ఓ చిత్రంలోనూ నటించబోతున్నా. దాంతో పాటు మరో కథ నచ్చింది. ఆ వివరాల్ని నిర్మాణ సంస్థే త్వరలో వెల్లడిస్తుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దగ్గర చాలా కథలుంటాయి. 'సమ్మోహనం' డబ్బింగ్‌ జరుగుతున్నప్పుడు 'ఏదైనా ఒక మంచి కథ చెప్పండి సర్‌' అన్నాను సరదాగా. అప్పుడు 'వి' లైన్‌ చెప్పారు. భలే అనిపించింది. నా పేరేమైనా చెబుతారా అని 'ఈ కథకి హీరోలుగా ఎవరిని అనుకుంటున్నారు సర్‌?' అని అడిగా. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు చేస్తే బాగుంటుందని చెప్పారు. 'చాలా పెద్ద రేంజ్‌లో ఉన్నారు, మనం ఆలోచించడం కరెక్ట్‌ కాదు' అనుకున్నా. కానీ ఆ ఇద్దరూ చేస్తే నిజంగా భలే ఉంటుందనిపించింది. కొన్నాళ్ల తర్వాత ఈ కథలో నటించే అవకాశం మళ్లీ నాకే వచ్చినప్పుడు ఆశ్చర్యపోయా. నాని విషయంలోనూ అంతే. నేను 'బాఘీ'లో విలన్‌గా చేసొచ్చాక నాని ఓ ట్వీట్‌ చేశాడు. నేనూ విలన్‌గా ప్రయత్నిస్తానని ఆ ట్వీట్‌లో చెప్పాడు. నీకు సెట్టవ్వదు, నువ్వు హీరోగానే బాగుంటావని నేనన్నా. 'లేదు లేదు, నువ్వు హీరోగా, నేను విలన్‌గా చేద్దాం' అని తను బదులిచ్చాడు. తథాస్తు దేవతలంటారు కదా, వాళ్లే విన్నారేమో మరి! నిజంగానే తను విలన్‌గా, నేను హీరోగా 'వి'లో నటించాం.

ఇదీ చూడండి..'పక్కా లోకల్'​ సాంకేతికతతో తెరకెక్కనున్న 'పుష్ప'

Last Updated : May 11, 2020, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details