ఖంగుమనే గొంతే ఆయన ఆయుధం. ఆ గొంతుతోనే సినీ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. కొంతమంది స్టార్ హీరోలకు గళమిచ్చారు. వారిని విజయపథంలోకి నడిపించారు. అక్కడితో ఆగలేదు... తానే స్వయంగా రంగంలోకి దిగి నటనతో ప్రేక్షకుల్లో జోష్ నింపారు. పోలీస్ డ్రెస్ వేసి లాఠీ చేత పట్టి...పేజీలకు పేజీల డైలాగులు నాన్ స్టాప్‌గా చెప్తూ థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. ఒక్క సినిమా ద్వారానే కాకుండా టెలివిజన్ స్క్రీన్ లపై కూడా దూకి ప్రతి ఇంటికి వెళ్లి కావాల్సినంత వినోదాన్ని పంచారు.
టీవీ హోస్ట్‌గా ఆయన చేసిన షోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం...అనుబంధాలు, ఆత్మీయతలతో అల్లుకున్న అందమైన కుటుంబాలను టీవీ తెరపైకి రప్పించి హల్చల్ చేస్తున్నారు. మనం పేరుతో ఆయన ఈటీవీలో ఆవిష్కరిస్తున్న కుటుంబ కదంబం సర్వులకూ అంతులేని ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆయనే... మనలో ఒకరయిన మన సాయి కుమార్. నేడు ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
కనిపించని నాలుగో సింహం
సాయి కుమార్ పేరు చెప్పగానే... కనిపించని నాలుగో సింహం పోలీస్... అన్న డైలాగ్ ప్రతి ప్రేక్షకుల గుండెల్లో ఫిరంగి మోగినట్లు మోగుతుంది.
1960 జులై 27న పుట్టిన సాయికుమార్ కుటుంబానికి సినీ నేపథ్యం ఉంది. తండ్రి పి..జె.శర్మ, తల్లి కృష్ణ జ్యోతి. తండ్రి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో ప్రఖ్యాతి గాంచిన డబ్బింగ్ ఆర్టిస్ట్. తల్లి కృష్ణ జ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. కన్నడ కథానాయకుడు డాక్టర్ రాజకుమార్‌తో పాటు అప్పటి అగ్రశ్రేణి హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న కళాకారిణి.
తల్లితండ్రులిద్దరూ సినీ రంగానికి చెందినవారే కావడం వల్ల రంగుల ప్రపంచంపై సాయికుమార్‌కు ఆసక్తి కలిగింది. తండ్రి నుంచి వచ్చిన గంభీరమైన గళ వారసత్వం కూడా ఆయనకు పెద్ద మద్దతుగా నిలిచింది. బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సాయికుమార్.. బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు కీలక పాత్ర పోషించారు. వైకల్యం ఉన్నా స్నేహం పంచే మనసుకు ప్రేమ తప్ప వైకల్యం లేదని నిరూపిస్తూ రూపొందిన ఈ చిత్రం కన్నీరు పెట్టిస్తుంది. ఆర్ద్రత నిండిన ఆరుద్ర పాటలు, సున్నితమైన గాయకుల గళం... సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించిన బాపు దర్శకత్వ ప్రతిభ...ఈ చిత్ర విజయానికి కారణమయ్యాయి. బాపు డైరెక్షన్లో మెరిసిన సాయికుమార్ అనతి కాలంలోనే మంచి నటుడిగా ఎదిగారు. డబ్బింగ్ కళాకారుడిగా సత్తా చాటుకున్నారు.