బాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చేది గోవిందా. ఆయన నటన, నృత్యం చాలా విభిన్నంగా ఉంటాయి. తనదైన శైలితో ఎన్నో సినిమాల్లో నటించి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 90వ దశకంలో టాప్ హీరోగా వెలుగొందిన గోవిందా.. నేటి తరం నటీనటులకు ఆయన ఒక స్ఫూర్తి. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ తొలినాళ్ల అనుభవాలను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డానని చెప్పారు.
"సినీ పరిశ్రమలో పెద్దగా పరిచయాలు కూడా లేవు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుకు వెళ్లినప్పుడు వారిని కలిసేందుకు గంటలకొద్ది ఎదురు చూసేవాడిని. చాలా మంది సినిమాల్లో నువ్వు నటించలేవని తేల్చి చెప్పేవారు. నేనే కాదు.. ఇప్పటి చాలా మంది ప్రముఖ నటులు వారి కెరీర్ మొదట్లో ఇబ్బందులు పడ్డారు. తీవ్ర పోటీ ఉండే ఈ సినీ పరిశ్రమలో దీన్ని సరైన దృక్పథంతో చూడాలి. కొందరి చేతుల్లోనే బాలీవుడ్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతున్నాయి"