2022 Star heroine movies: కరోనా కొట్టిన దెబ్బకు రెండేళ్లుగా సరైన సినిమాలు లేక ప్రేక్షకులే కాదు చిత్రసీమా ఆందోళన చెందింది. అందరూ ఆశలన్నీ ఈ ఏడాదిపైనే ఉంచుకున్నారు. కథానాయికలు మరిన్ని ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే గత ఏడాదిలో చాలామంది నాయికల సినిమాలు థియేటర్‌లో సందడే చేయలేదు. ఈ ఏడాది మూడో నెల నడుస్తున్నా కొందరు బోణీ చేయలేదు. 2022 పూర్తయ్యే లోపు రెండు చిత్రాలకు తగ్గకుండా తమనుంచి వస్తాయంటూ సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే సినిమాల్ని పూర్తి చేసిన భామలు కొందరైతే...మరికొందరు చిత్రీకరణల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రేక్షకుల్ని థియేటర్లలో అలరించిన నాయిక అంటే అలియాభట్ అనే చెప్పాలి. ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంతో బాక్సాఫీసుకు కొత్తగా కళ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇక భూమి పెడ్నేకర్ నటించిన ‘బధాయి దో’ ప్రేక్షకుల ముందుకొచ్చినా అంతగా మెప్పించలేదు. రానున్న నెలల్లో ప్రేక్షకుల్ని అలరించడానికి దీపికా పదుకొణె, రకుల్ ప్రీత్ సింగ్, కత్రినాకైఫ్, కంగన రనౌత్, తాప్సి, కియారా అడ్వాణీ, పరిణీతి చోప్రా తదితర భామలంతా సిద్ధమవుతున్నారు.
నాలుగు చిత్రాలకు తగ్గేదేలే
Aliabhatt RRR movie: ఈ ఏడాదికి మంచి బోణీ కొట్టిన అలియాభట్ నుంచి మరో మూడు చిత్రాలు రానున్నాయి. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో సీత పాత్రలో నటించింది అలియా. ఈ సినిమా ఈ నెల 25 విడుదల కానుంది. భారీ అంచనాలు నెలకొన్నాయి. అలియా నుంచి రానున్న మరో పెద్ద చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు సెప్టెంబరు 9న విడుదల చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ కథలో అమితాబ్‌బచ్చన్, నాగార్జున తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ అగ్ర కథానాయికల సరసన చేరిన అలియా ఈ చిత్రంతో టాప్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ ఏడాదిలోనే అలియా నటించిన ‘డార్లింగ్స్’ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అలరించనుంది.
Rakulpreet singh movies: దక్షిణాదిలో అలరించిన రకుల్‌ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది ఆమె నుంచి ఐదు చిత్రాలకు పైగానే రానున్నాయి. దీన్నిబట్టి ఆమె కెరీర్ ఎంత జోరుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జాన్‌అబ్రహంతో కలిసి నటించిన ఆమె ‘అటాక్ పార్ట్ 1’ ఏప్రిల్ 1న, అజయ్‌దేవ్‌గణ్‌తో తెర పంచుకున్న ‘రన్‌వే 34’ ఏప్రిల్ 29న, ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కట్టిన ‘డాక్టర్ జి’ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో నటించిన ‘ఛాత్రివలీ’ నవంబరు 13న వస్తోంది. వీటితో పాటు రెండు తమిళ చిత్రాలతోనూ అలరించనుంది రకుల్.
Tapsee Mihtaliraj biopic: కెరీర్ పరంగా జోరు చూపిస్తున్న మరో కథానాయిక తాప్సి. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆమె ఖాతాలో ఈ ఏడాది నాలుగు చిత్రాలపైగానే చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ‘లూప్ లపేటా’ చిత్రంతో ఓటీటీ ద్వారా అలరించిన తాప్సి నుంచి త్వరలో ‘శెభాష్ మిథు’. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథతో రానుందీ చిత్రం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారామె. ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ ఏప్రిల్ 1న విడుదల కానుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాప్సి నటించడంతో పాటు తొలిసారి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘బ్లర్’. ఈ సినిమా విడుదలయ్యేది ఈ ఏడాదిలోనే అయినా తేదీ ఖరారు కాలేదు
Rashmika bollywood movies: దక్షిణాదిలో టాప్ నాయికల్లో ఒకరైన రష్మిక ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మే 13న రానుంది. అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో వికాస్ భల్ దర్శకత్వంలో వస్తోన్న ‘గుడ్‌బై’ చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చినా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఆమె నటించిన ‘పుష్ప’ హిందీలోనూ విడుదలై భారీ విజయం సాధించింది. ఇటీవలే ఆమె నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.