WhatsApp Web Screen Lock Feature : వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ వెబ్ కోసం స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో వాట్సాప్ వెబ్ వాడే యూజర్ల డేటా భద్రత కోసమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడం జరిగింది.
కార్యాలయాల్లో, ఎక్కువ మంది కలిసి పనిచేసే చోట్లలో.. మన వ్యక్తిగత వాట్సాప్ మెసేజ్‌లను ఇతరులు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు మనం ఏమరుపాటుగా ఉండడం చూసి.. మన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లను ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యను పరిష్కరించడం కోసమే.. వాట్సాప్ స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
సింపుల్‌గా లాక్ చేసుకోవచ్చు!
కార్యాలయంలో కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడూ మనం విరామం తీసుకుంటూ ఉంటాం. టిఫిన్ చేయటానికో, టీ తాగటానికో కాసేపు బయటకు వెళ్తుంటాం. ఈ సమయంలో మన వాట్సప్‌ను ఓపెన్ చేసి పెడితే ఇతరులు ఎవరైనా దానిని చూసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సున్నితమైన సమాచారం కూడా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు వాట్సాప్ నుంచి లాగ్అవుట్ అవుతూ ఉంటారు. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాక మరలా లాగిన్ అవుతూ ఉంటారు. ఇదంతా పెద్ద ప్రహసనం. మాటిమాటికీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లాగిన్ కావటం విసుగు తెప్పించే అంశం. పైగా తరచూ లాగ్అవుట్, లాగిన్ అవుతూ ఉంటే.. గత మెసేజ్‌లు వెంటనే కనిపించకపోవచ్చు కూడా. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ వాట్సాప్ తాజాగా స్క్రీన్ లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ వెబ్ స్క్రీన్ లాక్‌ను ఎనేబుల్ చేసుకోండిలా!
- ముందుగా మీరు web.whatsapp.com ఓపెన్ చేయాలి.
- క్యూఆర్ కోడ్‌తో web.whatsapp.com లోకి లాగిన్ కావాలి.
- స్క్రీన్ పైన ఉన్న మూడు చుక్కల గుర్తు మీద క్లిక్ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
- ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే.. స్క్రీన్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది.
- వెంటనే మీరు స్క్రీన్ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత..
- వాట్సాప్ స్క్రీన్ మీద కనిపించే సూచనలు పాటిస్తూ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- మీరు కావాలనుకుంటే స్క్రీన్ లాక్ టైమింగ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.