ETV Bharat / science-and-technology
కాల్స్ మ్యూట్.. పర్మిషన్ ఉంటేనే గ్రూప్‌లో జాయిన్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తుంటాయి. అలాగే త్వరలో మరికొన్ని ఫీచర్లను యూజర్లకు అందించనుంది కంపెనీ. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రచారంలో ఉండి, త్వరలో అందుబాటులోకి వస్తాయంటున్న ఆసక్తికర వాట్సాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం
whatsapp rumoured upcoming features
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. యూజర్స్‌కు కొత్త అనుభూతిని అందించడం కోసం కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. అలా చాలా సార్లు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రచారంలో ఉండి, త్వరలో అందుబాటులోకి వస్తాయంటున్న ఆసక్తికర వాట్సాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం
- వాట్సాప్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. కానీ, అటాచ్‌మెంట్ సెక్షన్‌లో మాత్రం పెద్దగా మార్పులు జరగడం లేదు. కాగా, వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త వెర్షన్ (V2.23.6.17)లో అటాచ్‌మెంట్ సెక్షన్‌లో పాప్ అప్ స్టైల్‌ను పూర్తిగా మార్చేయబోతోంది. మొబైల్‌లో నోటిఫికేషన్ ప్యానల్ తరహాలో.. ఐకాన్స్ మాదిరిగా ఉండబోతోందని సమాచారం.
- వాట్సాప్‌లో ఓ వ్యక్తి పేరుతో సెర్చ్ చేస్తే.. ఆ వ్యక్తి సభ్యుడిగా ఉన్న గ్రూప్‌ల వివరాలు కూడా వస్తే.. బాగుంటుంది కదా! ఇలాంటి కోరికే చాలా మంది యూజర్లకు ఉంటుంది. వినియోగదారులు కోరుకున్న అలాంటి ఫీచర్ త్వరలోనే ఈ ఫీచర్‌ను మీరు చూడబోతున్నారు. ఈ మేరకు బీటా వెర్షన్ వాట్సాప్‌లో మార్పులు చేశారు. గ్రూప్స్ ఇన్ కామన్ (Groups in common) పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
- ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు కావాలంటే వారు జాయిన్ అవ్వొచ్చు. గ్రూప్ ఇన్వైట్ లింక్ ఉంటే దానిపై క్లిక్ చేసి గ్రూపులో చేరిపోవచ్చు. అయితే, త్వరలో ఇది కుదరదు. ఎందుకంటే త్వరలో గ్రూపులో ఎవరైనా చేరాలంటే అడ్మిన్ పర్మిషన్ కావాల్సిందే. అనంతరం గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్తే అక్కడ (Pending participants) అనే ఆప్షన్ ఉంటుంది. కొత్తగా వచ్చిన రిక్వెస్ట్‌లను అక్కడ చూడొచ్చు.
- ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌ల్లో ఇతరుల చాటింగ్ దగ్గర ఆ వ్యక్తి పేరు వస్తుంది. ఆ వ్యక్తి నంబర్ మీ మొబైల్‌లో లేకపోతే అక్కడ కేవలం వారి నంబరు చూపిస్తుంది. అయితే, దీని వల్ల ఆ మెసేజ్ చేసింది ఎవరు అని గుర్తించడం అంత సులభం కాదు. కాగా, త్వరలో నంబర్ బదులు పేరు కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి.. తన వాట్సాప్‌లో పెట్టుకున్న పేరు మీకు వస్తుందన్నమాట.
- వాట్సాప్ గ్రూప్‌ల్లో ఇప్పటివరకు మెసేజ్‌లకు ఎక్స్పైరీ చూసుంటారు. కానీ, త్వరలో వాట్సాప్ గ్రూప్‌కు సైతం ఎక్స్పైరీ చూస్తారు. అదేంటంటే.. ఏదైనా అవసరం కోసం కొన్ని రోజులు తాత్కాలికంగా గ్రూప్‌ను క్రియేట్ చేసుకునేలా ఓ ఆప్షన్ తీసుకొస్తున్నారు. ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు.. గ్రూప్ ఎన్ని రోజులు ఉండాలి అనే ఆప్షన్ అడుగుతారు. అక్కడ మనం ఇచ్చే టైంను బట్టి ఆ గ్రూప్ లైవ్‌లో ఉంటుంది.
- మీ కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి మీకు కాల్స్ వస్తే.. ఆ కాల్ మ్యూట్ అవ్వడం లేదంటే బ్లాక్ చేయడం చేయొచ్చు. చాలా మొబైల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను.. త్వరలో వాట్సాప్‌లోకి తీసుకొస్తారు. అంటే అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వస్తే.. ఆ కాల్ మ్యూట్‌లోకి వెళ్లిపోతుందన్నమాట. కాల్స్ లిస్ట్‌లోకి వెళ్లి అలాంటి కాల్స్ ఏం వచ్చాయి అనేది తర్వాత చూసుకోవచ్చు.