ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో వాట్సాప్ యూజర్లలో గందరగోళం నెలకొంది. కొత్త పాలసీకి అంగీకారం తెలపడం ఇష్టంలేని చాలా మంది టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.
యూజర్లలో మార్పు ఇలా..
ఓ సర్వే ప్రకారం భారత్‌లో 18 శాతం మంది మాత్రమే వాట్సాప్‌ను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 36శాతం మంది వాట్సాప్ వినియోగాన్ని భారీగా తగ్గించాలనుకుంటున్నట్లు వెల్లడైంది. 15 శాతం మంది వాట్సాప్ పూర్తిగా వాడకూడదని నిర్ణయించుకున్నట్లు సర్వే వివరించింది.
పేమెంట్ సదుపాయం వాడేది లేదు..
మాషబుల్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 శాతం మంది యూజర్లు (గ్రూప్‌లతో కలిపి) వాట్సాప్‌ను వీడి ఇతర యాప్‌లను వాడాలనుకుంటున్నారు. 91 శాతం మంది వాట్సాప్ పేమెంట్ సదుపాయాన్ని వినియోగించబోమని తేల్చి చెప్పారు. దేశంలోని 244 జిలాల్లో 24 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
పేమెంట్ సదుపాయాన్ని వినియోగిస్తే.. ఆ లావాదేవీల సమాచారాన్ని వాట్సాప్ తమ మాతృసంస్థ ఫేస్బుక్ సహా ఇతర అనుబంధ కంపెనీలతో పంచుకుంటుందన్న అనుమానాలు ఇందుకు కారణంగా సర్వే పేర్కొంది.