Fake whatsapp: ఇది వాట్సాప్ లాంటిదే.. అచ్చంగా అలాగే ఉంటుంది.. అందులో లేని ఫీచర్లు ఇందులో దొరుకుతాయి! ఇలాంటి మాటలు, మెసేజ్‌లు మీరు వినే ఉంటారు.. చూసే ఉంటారు కూడా. అయితే వీటిని ఎంత మాత్రం విశ్వసించొద్దని టెక్ నిపుణులు చెబుతున్నా నకిలీ వాట్సాప్‌లు వాడి ఇబ్బంది పడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా మరో నకిలీ వాట్సాప్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వాట్సాప్‌సీఈఓ తమ ఆండ్రాయిడ్ వినియోగదారులకు జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలు చేశారు.
గత కొన్ని రోజులుగా టెక్ సర్కిల్స్‌లో, ఆన్‌లైన్‌లో ఓ యాప్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే 'హే వాట్సాప్'. ఈ యాప్‌ను 'హే మోడ్స్' అనే డెవలపర్ రూపొందించారు. వాట్సాప్ సీఈఓ విల్ కాథ్‌కార్ట్ దీనిపైనే వినియోగదారులకు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. "వాట్సాప్ పేరుతో వస్తున్న ఎలాంటి నకిలీ యాప్‌లను వాడొద్దు. ఒకవేళ వాడితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు" అంటూ విల్ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుందని తెలిపారు.
వాట్సాప్‌లా ఉంటూ, అలాంటి సేవలు అందిస్తున్న 'హే వాట్సాప్' అనే యాప్‌ను తమ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ గుర్తించదని.. అందుకే ఈ సూచనలు చేస్తున్నామని విల్ తెలిపారు. వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయని, అయితే వాటిని వాడితే వ్యక్తిగత సమాచారం అగంతుకుల చేతుల్లోకి వెళ్తుందని ఆయన వెల్లడించారు. ఆ యాప్స్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదని.. దాని వల్ల సమాచారం లీక్ అవుతుందని విల్ పేర్కొన్నారు.