ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఎప్పటికప్పుడు ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, వీడియోకాలింగ్, ఫైల్ షేరింగ్ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎన్‌క్రిప్ట్‌డ్‌ను ఆప్షనల్‌గా ఎంచుకునేలా 'సీక్రెట్ చాట్స్'ను అందిస్తోంది. దాదాపు 500 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్స్ కలిగిన టెలిగ్రామ్ యాప్‌ను కొన్ని చిట్కాలు, ట్రిక్‌లు పాటిస్తే మరింత మెరుగ్గా వినియోగించుకునే అవకాశం ఉంది. మరి అవేంటో చూద్దాం...
మెసేజ్‌లను ఎడిట్.. షెడ్యూల్ చేయొచ్చు
మీరు మీ ఫ్రెండ్‌కు మెసేజ్‌కు పంపారు. అయితే అందులో స్పెల్లింగ్ మిస్టేక్‌గానీ, ఇతర పొరపాటు ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం టెలిగ్రామ్‌లో మెసేజ్‌ను ఎడిట్ చేసి సెండ్ చేసే అవకాశం ఉంది. మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ మీద 'ఎడిట్' ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. అప్పుడు యాప్‌లో ఎడిటెడ్ లేబుల్ కనిపిస్తుంది.. ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవడమే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే..? మీరు పంపిన మెసేజ్‌ను 48 గంటల్లోగా మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది మరి.
షెడ్యూల్ చేయవచ్చు.
బర్త్‌డే విషెస్ చేప్పేందుకు సరిగ్గా 12 గంటలకు మెసేజ్ పెట్టాలనుకుంటాం. ఆ సమయానికి నిద్ర వచ్చేస్తే.. ఇష్టమైన వారి చిరుకోపానికి గురి కావాల్సి ఉంటుంది. అలాకాకుండా ఆ సమయానికి మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకునే అవకాశం ఉంది. మెసేజ్‌ను రెడీ చేసి 'సెండ్' బటన్‌ను హోల్డ్ చేసి ‘షెడ్యూల్ మెసేజ్’ ఆప్షన్‌లోకి వెళ్లి డేట్, టైమ్‌ను సెట్ చేయాలి. ఆటోమేటిక్‌గా ఆ సమయానికి మెసేజ్ వెళ్లిపోతుంది.
సైలెంట్‌గా వెళ్లిపోతుంది..
టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం చేసే వర్క్ కూడా సరళతరమవుతోంది. ఫోన్‌ను సైలెంట్ పెట్టకపోతే ఏదైనా మెసేజ్ వస్తే రింగ్ సౌండ్ గానీ, వైబ్రేట్‌గానీ అవుతుంది. అయితే పదేపదే మెసేజ్‌లు వస్తుంటే కాస్త చిరాకు పడుతుంటాం. ఇదే పరిస్థితి అవతలి వారికీ ఉండొచ్చు. అందుకోసం 'సైలెంట్ మెసేజెస్' ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మనం పంపాలనుకుంటున్నవారికి ఎలాంటి సౌండ్ లేకుండా మెసేజ్ చేయవచ్చు. మెసేజ్ రిసీవర్ 'డు నాట్ డిస్టర్బ్'మోడ్‌ను ఆన్ చేసినా చేయకపోయినా సందేశాన్ని సౌండ్ లేకుండా పంపే అవకాశం ఉంది. దీని కోసం మీరు మెసేజ్‌ను పంపేటప్పుడు 'సెండ్' బటన్‌ను హోల్డ్ చేసి పట్టుకుని 'సెండ్ వితౌట్ సౌండ్' ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
సాధారణ చాటింగ్‌లోనూ సెల్ఫ్ డిస్ట్రక్ట్.. మెసేజ్ డిలీట్
మెసేజ్‌లు డిసప్పియర్ అయిపోయేలా టెలిగ్రామ్‌లోనూ ఫీచర్ ఉంది. అయితే ఇంతకుముందు 'సీక్రెట్ చాట్'కు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు సాధారణ చాటింగ్, ఫొటోలు, వీడియోలకు కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. దాని కోసం ఇమేజ్‌నుగానీ, వీడియోగానీ సెలెక్ట్ చేసుకుని ‘టైమర్’ బటన్‌ను ఎనేబుల్ చేసి టైమ్‌ను సెట్ చేస్తే.. ఆ సమయానికి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి.
టెలిగ్రామ్‌లో పంపిన సందేశాలను డిలీట్ చేయవచ్చు. అలానే ఇతరులు మీకు పంపిన వాటిని ఇరువైపులా తొలగించే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సింపుల్. మీకు వచ్చిన మెసేజ్‌ను ఎంచుకుని డిలీట్ బటన్‌ను నొక్కండి.. 'ఆల్‌సో డిలీట్ ఫర్ X' ఎంచుకుని డిలీట్ చేసేయడమే. దీంతో రెండు వైపులా మెసేజ్ తొలిగిపోతుంది.
వీడియోస్ ఎడిట్.. జిఫ్, యూట్యూబ్ క్విక్ సెర్చ్
సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత వీడియోలను తయారు చేయడం ఎక్కువైపోయింది. అందుకోసం టెలిగ్రామ్ కూడా తన యూజర్లకు వీడియో ఎడిటింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ వీడియోనైతే మీరు పంపించాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వీడియో ఎడిటర్‌ను ఓపెన్ చేసి దానికి మెరుగులు దిద్దండి. సాట్యురేషన్, కాంట్రాస్ట్, ఎక్స్‌పోజర్, బ్రైట్‌నెస్ వంటి వాటిని అడ్జస్ట్‌చేసి సెండ్ చేసుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో జిఫ్‌లు, యూట్యూబ్ లింక్‌ల వాడకం పెరిగింది. ఏదైనా మెసేజ్‌కు ప్రతిస్పందనగా వాటిని వినియోగిస్తుంటాం. అయితే జిఫ్‌లు, యూట్యూబ్ లింక్‌లను టెలిగ్రామ్ యాప్ బయటకు పోకుండానే వాడుకోవచ్చు. దాని కోసం సెర్చింగ్‌లో మీకు కావాల్సిన @gif, @youtube లింక్‌ను టైప్ చేయాలి. దానికి సంబంధించిన జిఫ్‌లు, యూట్యూబ్ లింక్‌లు చాట్ స్క్రీన్ మీద వచ్చేస్తాయి. వాటిని ఎంచక్కా వాడేసుకోవడమే.