US Moon Mission 2024 :50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు అమెరికా సంస్థ చేపట్టిన ప్రయోగం సందిగ్ధంలో పడింది. లాంఛింగ్ అయిన గంటలకే స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇంధన లీకేజీ లోపం బయటపడింది. పిట్స్బర్గ్కు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి ల్యాండర్‌ను పంపింది. ఈ ల్యాండర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో వైఫల్యాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫల్సన్ సిస్టమ్‌లో లోపం ఉంటే చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం కోల్పోతుంది.
ఈ నేపథ్యంలో ప్రయోగం జరిగిన 7 గంటల తర్వాత ల్యాండర్‌ను సూర్యుడి దిశగా తిరిగేలా చేశారు. ల్యాండర్‌కు కావాల్సిన శక్తి సోలార్ ప్యానెల్ ద్వారా స్వీకరించే విధంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 23న జాబిల్లిపై ల్యాండర్ దిగాల్సి ఉంది. అయితే, చాలా వరకు ఇంధనం వృథా అయిన నేపథ్యంలో ల్యాండింగ్‌పై ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లక్ష్యాలను సవరించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమనే విషయంపై అంచనా వేసుకుంటున్నట్లు వివరించారు.
ప్రైవేటు కంపెనీలకు నాసా భారీగా ఫండింగ్
చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా అవతరించాలని ఆస్ట్రోబోటిక్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగ్రీన్ అనే ల్యాండర్ ద్వారా శాస్త్రీయ పరికరాలను జాబిల్లిపైకి పంపించింది. ఈ పరికరాలు చంద్రుడి ఉపరితలంపై అధ్యయనంచేసి నాసాకు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంది. అటు హ్యూస్టన్ ను చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ త్వరలోనే ల్యాండర్ ప్రయోగం చేపట్టనుంది. జాబిల్లి ప్రయోగాల కోసం ఈ కంపెనీలకు నాసా భారీగా నిధులు సమకూర్చింది.