పాస్‌వర్డ్‌లను తరుచూ మర్చిపోయే వారికి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికివరకూ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీలతో ట్విట్టర్లోకి లాగిన్ అవుతుండగా.. ఇకపై గూగుల్ అకౌంట్‌తో కూడా లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పించనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. యూజర్లు చాలా మంది ముందుగానే గూగుల్ అకౌంట్‌తో సైన్ఇన్ అయ్యి ఉంటారని.. దీంతో ట్విట్టర్ లాగిన్‌కు చాలా తక్కువ సమయం పడుతుందని పేర్కొంది.
అయితే ఇప్పటికే ట్విట్టర్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ బీటా వర్షెన్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలుస్తోంది. దీనిలో గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యేందుకు ఆప్షన్స్ చూపిస్తోందని సమాచారం. కానీ ఐఓఎస్‌కు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వీటిపై దీనిపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. కొత్తలాగిన్ ఆప్షన్ ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది అనే దానిపై స్పష్టతలేదు.
సరికొత్త హంగులతో...
మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ మరిన్ని హంగులను యాప్‌కు జోడించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలో రానున్న అప్డేట్స్లో కీలకమైన అప్‌ఓట్, డౌన్ఓట్ బటన్లతో పాటు వాయిస్ ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ వాయిస్ ట్రాస్స్ ఫార్మర్ ద్వారా లైవ్‌లో పాల్గొనేటప్పుడు వివిధ వాయిస్ ఎఫెక్ట్స్‌తో స్వరాన్ని మార్చుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ ట్వీట్ చేసింది. అయితే ఈ సదుపాయం ఐఓఎస్ యూజర్లకు యాప్‌లో తొలుత అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.