Twitter new logo X : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అనుకున్నంత పని చేసేశారు. ఫేమస్ ట్విట్టర్ లోగో 'పిట్ట'ను మార్చేసి 'X' లోగోను తీసుకొచ్చారు. ఆదివారం ట్విట్టర్ లోగో మారుస్తామని ప్రకటించిన మస్క్.. కేవలం 24 గంటల్లోనే పిట్టను ఎగరేశారు.
బ్లూబర్డ్కు వీడ్కోలు
Twitter Blue Bird Logo : మొదటి నుంచి ట్విట్టర్‌కు బ్లూబర్డ్ ప్రధాన లోగోగా ఉంది. ఇది వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యింది. కోట్లాది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. కానీ నేడు దానికి ఎలాన్ మస్క్ వీడ్కోలు పలికారు.
సరికొత్తగా మారుస్తారా?
Twitter new brand name : ట్విట్టర్‌ను సూపర్ యాప్‌గా మార్చే దిశగా ఎలాన్ మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా దానిని ఎక్స్ కార్ప్ సంస్థలో విలీనం చేశారు. ఎవ్రీథింగ్ యాప్ రూపకల్పనలో ట్విట్టర్‌ను సమిధగా చేయడానికి నిర్ణయించుకున్నారు.
ట్రెండ్ అవుతున్న X లోగో
Twitter new logo X trending : సోమవారం ట్విట్టర్ లోగో మారిపోయింది. ఇది జరిగిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా x లోగో ట్రెండ్ కావడం మొదలైంది. ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ సోమవారం కంపెనీ హెడ్ క్వార్టర్స్‌లో కొత్త లోగో Xను ప్రదర్శించారు. అలాగే కంపెనీ సీఈఓ లిండా కూడా కొత్త లోగోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనితో ఇది కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మస్క్ ప్రొఫైల్ లోగో మార్పు!
Elon Musk Twitter Profile Pic change : ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లోగోను కూడా Xగా మార్చేశారు. అలాగే 'X is live' అని పోస్టు చేశారు.
మస్క్ దెబ్బకు ట్విట్టర్ కుదేలు!
Elon Musk Twitter changes : సుమారు 6 నెలల క్రితం బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నారు. తరువాత ఆ సంస్థలో అనేక మార్పులు చేశారు. కీలకమైన ఉద్యోగులను తొలగించారు. ఎన్నో విధానపరమైన మార్పులు చేశారు. దీని వల్ల ట్విట్టర్ ఆర్థికంగా అనేక ఒడుదొడుకులకు లోనైంది. ముఖ్యంగా ప్రకటనల ఆదాయం భారీగా పడిపోయింది. అయినప్పటికీ మస్క్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ట్విట్టర్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంతో అనుభవజ్ఞురాలైన లిండాను సీఈఓగా తీసుకొచ్చారు. అలాగే బ్లూటిక్ పొందిన యూజర్లు, వెరిఫైడ్ యూజర్లు ట్విట్టర్ వేదికగా వేలాది డాలర్లు సంపాందించేందుకు వీలును కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా యాడ్ రెవెన్యూను వెరిఫైడ్ యూజర్లకు షేర్ చేస్తామని తెలిపారు.