కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి మాస్క్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇదే అవకాశంగా మలుచుకుని పలువురు తమ ప్రతిభను కనబరుస్తూ అనేక రకాల ముఖ కవచాలను సృష్టించారు. వాటికి గిరాకీ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇటీవల ఓ టెక్ నిపుణుడు డిజిటల్ మాస్క్‌ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్కు చెందిన ఓ సంస్థ.. స్వయంగా వైరస్‌ను నాశనం చేయగల స్మార్ట్ ఫేస్‌మాస్క్‌ను తయారు చేసింది. 'లీఫ్' పేరుతో విడుదలైన ఈ మాస్క్.. ప్రపంచంలోనే తొలిసారి యూవీసీ సాంకేతికతతో రూపొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పర్యావరణహిత మాస్క్
పునర్వినియోగానికి వీలుండేలా 'లీఫ్ మాస్క్'ను డెట్రాయిట్కు చెందిన రెడ్‌క్లిఫ్ హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసింది. ఈ మాస్క్‌లో ఎన్99+ హెపా(హై ఎఫీషియెన్సీ పర్టిక్యులేట్ ఎయిర్) ఫిల్టర్‌ను అమర్చినట్లు సంస్థ తెలిపింది. ఈ మాస్క్ పారదర్శకంగా ఉండటం వల్ల దీన్ని ధరించినా ముఖం కనిపిస్తుంది.
"రోజురోజుకు మాస్క్‌ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఒకసారి ఉపయోగించి పారేసే ముఖ కవచాల వల్ల పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు 'లీఫ్ మాస్క్'ను తయారు చేశాం. ఇది శక్తిమంతమైంది. పునర్వినియోగించుకొనే అవకాశం ఉండటం వల్ల వాతావరణానికి ఎటువంటి హాని ఉండదు.
-ఆడమ్ లైట్‌మ్యాన్, రెడ్‌క్లిఫ్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకులు