స్మార్ట్ఫోన్ల కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. క్రెడిట్, డెబిట్ కార్డ్ గడువు ముగిసిందని, లాటరీ తగిలిందని, మీ ఫోన్ సేవలు నిలిపివేయకుండా ఉండాలంటే వివరాలు చెప్పాలని కాల్స్ వస్తుంటాయి. కొందరు యూజర్లు ఆ మాయమాటలు నమ్మి.. వ్యక్తిగత సమాచారం, వన్‌టైమ్ పాస్వర్డ్, బ్యాంక్ వివరాలు వంటివి చెప్పేస్తారు. అలా ఎక్కడో ఉండి మన బ్యాంక్‌లోని డబ్బులు డ్రా చేయడం, మన ప్రమేయం లేకుండానే మన వివరాలతో షాపింగ్ బిల్లులు కట్టేయడం చేస్తుంటారు సైబర్ కేటుగాళ్లు. అయితే ఈ మోసాల్లో కీలకమైనది ఫోన్ కాల్. ఎందుకంటే అచ్చం సంస్థ ప్రతినిధుల్లాగే కాల్ చేసి మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. అందుకే ఈ నకిలీ, స్పామ్ దాడుల నుంచి తప్పించేందుకు సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్.
కాలర్ ఐడెంటిఫికేషన్, కాల్ బ్లాకింగ్ వంటి ఎన్నో సదుపాయాలు అందిస్తున్న గూగుల్ ఫోన్ యాప్.. వెరిఫైడ్ కాల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
గూగుల్ వెరిఫై చేస్తుంది!
బిజినెస్ కాల్ వస్తే దానికి సమాధానం ఇవ్వకముందే పూర్తి వివరాలు మన ఫోన్ తెరపై కనిపిస్తాయి. ఇందుకోసం 'ట్రస్ట్డ్ బిజినెస్' ఆప్షన్‌లోకి వెళ్లి ముందుగా బిజినెస్ వ్యక్తులు, కంపెనీలు గూగుల్ ఫోన్ యాప్‌లో సమాచారం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, వివరాలు పరిశీలించాక వెరిఫైడ్ కాల్ బ్యాడ్జ్ వస్తుంది. అప్పట్నుంచి యూజర్లకు కాల్స్ చేయడానికి వీలుంటుంది. అప్పుడు యూజర్ కూడా తనకు వచ్చిన కాల్ వెరిఫై బ్యాడ్జ్ ఉంది కాబట్టి అధికారికంగా సంస్థ నుంచే కాల్ వచ్చిందని నిర్ధరించుకోవచ్చు.
నకిలీ కాల్స్ తగ్గుతాయ్..
స్కామ్‌లు, మోసాలు చేసే వారు ఇకపై సంస్థల పేర్లను వినియోగించడం కుదరదు. ఎవరైనా యూజర్లను తమ వ్యక్తిగత సమాచారం చెప్పాలని అడిగినా వెరిఫై బ్యాడ్జ్ లేకపోతే అనుమానం వ్యక్తం చేస్తారు. వీలైతే వారిని గట్టిగా ప్రశ్నిస్తారు. సాధారణ యూజర్లు వారి ఫోన్ నంబరును గూగుల్ అకౌంట్‌కు జత చేస్తే వెరిఫై బ్యాడ్జ్ వస్తుంది. అప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే పేరు ఫోన్ తెరపై కనిపిస్తుంది.
ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో అందుబాటులో ఉంది. త్వరలో ప్రపంచవ్యాప్తం చేయనున్నారు. అయితే ఈ బిజినెస్ ప్రోగ్రామ్‌లో సంస్థలు రిజిస్టర్ అవుతాయా? అనేది కాస్త సందిగ్ధంగా ఉంది.