Smishing Scams : సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. రోజూ ఎక్కడో ఒక చోటా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరులకు మెరుగైన సైబర్ భద్రతను అందించడమే లక్ష్యంగా ఇప్పటికే బాధితుల కోసం వెబ్సైట్లు, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాధారణంగా సైబర్ మోసాలు.. SMS, ఈ-మెయిల్స్, కాల్స్ ద్వారా జరుగుతుంటాయి. అయితే ఈ-మెయిల్స్ ద్వారా వచ్చే ఫేక్ సందేశాలను మనం సులువుగా పసిగట్టవచ్చు. ఎందుకంటే వాటిలో అక్షర దోషాలతో పాటు అన్వయ దోషాలను సులువుగా గుర్తుపట్టవచ్చు. అంతేకాకుండా స్పామ్ మెయిల్స్‌లోని సమాచారం అసమగ్రంగా ఉంటుంది.
తెలివి మీరుతున్నారు!
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరింత తెలివిమీరుతున్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. అందుకే సైబర్ ఫిషింగ్(మోసాలకు) పాల్పడుతున్న కేటుగాళ్లు అనుసరిస్తున్న 'స్మిషింగ్ స్కామ్'( Smishing Attacks ) విధానం గురించి కేంద్ర టెలికాం శాఖ ఇటీవలే పలు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇంతకీ స్మిషింగ్ స్కామ్ అంటే ఏమిటి? దీని బారి నుంచి బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
స్మిషింగ్ అంటే ఇది!
Smishing Meaning In Telugu : స్మిషింగ్ అనేది ఒక రకమైన ఫిషింగ్. అంటే ఈ స్కామ్‌లో కేవలం మొబైల్ వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంటారు సైబర్ కేటుగాళ్లు. వీళ్లు బాధితుల డివైజ్‌లకు అనవసరపు లేదా అనుమానస్పద సందేశాలను పంపిస్తారు. పొరపాటున వీటిని క్లిక్ చేస్తే.. మన పర్సనల్ డేటా మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ రకమైన చీటింగ్‌లో మన వ్యక్తిగత వివరాలైన క్రెడిట్ కార్డ్ నంబర్ సహా బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఉంది. ( Smishing Scams )
లింక్స్‌పై నో క్లిక్స్!
సాధారణంగా బ్యాంకులు సహా ఇతర ప్రభుత్వ సంస్థలు ఆర్థిక లావాదేవీలు, ఇతర వెరిఫికేషన్లకు సంబంధించి మనకు ఎలాంటి లింకులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించవు. అందుకే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దంటూ ఈ మధ్య మనకి అలర్ట్‌లను కూడా పంపుతున్నారు. అందువల్ల గుర్తుతెలియని నంబర్లు లేదా వెబ్సైట్ల నుంచి ఏవైనా అనుమానస్పద ఎస్ఎంఎస్లు, లింకుల వస్తే వాటిని క్లిక్ చేయకుండా ఉండటం మేలు.