Scientists About Jupiter : తోకచుక్కలు, గ్రహశకలాల వంటివి భూమి వైపు దూసుకొస్తున్న ప్రతిసారీ శాస్త్రవేత్తలు మనల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు. అవి భూమిని ఢీకొంటాయా, లేదా? ఢీకొడితే ఎంత నష్టం కలిగించొచ్చు? అనే వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు. చిన్న చిన్నవైతే ఏమోగానీ పెద్ద అంతరిక్ష వస్తువులు దూసుకొస్తుంటే ప్రపంచమంతా కంగారు పడిపోతుంది. భూమ్మీద రాజ్యమేలిన డైనోసార్ల యుగం ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం అంతమైంది గ్రహ శకలం ఢీకొట్టటం మూలంగానే మరి. అందుకే అంత భయం.
అంతరిక్షం నుంచి నిరంతరం బోలెడన్ని తోకచుక్కలు, గ్రహ శకలాలు దూసుకొస్తుంటాయి. కొన్నే భూమిని ఢీకొంటాయి. భూ వాతావరణంలోకి రాగానే మండిపోతాయి. కొన్ని భూ సమీపంలోకి వచ్చి వెనక్కి మళ్లి పోతుంటాయి. ఇంతకీ ఇవి మనల్ని ఢీకొట్టకుండా కాపాడుతున్నదేంటో తెలుసా? గురుగ్రహం! దీని బలమైన గురుత్వాకర్షణ బలం లేకపోయినట్టయితే తోకచుక్కలు.. ముఖ్యంగా ఊర్ట్ క్లౌడ్ నుంచి వచ్చేవి తరచూ భూమిని ఢీకొట్టేవే. ఇదొక్కటే కాదు.. మన భూమిని నివాస యోగ్యంగా మార్చటంలోనూ గురు గ్రహం తోడ్పడుతుండటం విశేషం. భూమి వాతావరణాన్ని నిర్దేశించటంలో గురుడి కక్ష్య కీలక పాత్ర పోషిస్తుంది.
సిద్ధాంత పరంగా చూస్తే- గురు గ్రహం కక్ష్య అండాకారంలో ఉంటే అది భూమిని మరింత నివాసయోగ్యంగా మారుస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్‌సైడ్ (యూసీఆర్) పరిశోధకులు ఇటీవల ప్రత్యామ్నాయ ఊహాత్మక సౌరవ్యవస్థను సృష్టించి పరిశీలించారు. దీని ప్రకారం.. గురుడు అక్కడే తన స్థానంలోనే ఉండి, భూమి కక్ష్యను నెట్టటం వల్ల గురుడి కక్ష్య అండాకారంలోకి మారుతోంది. దీని మూలంగానే మన భూమి మీద అతి చల్లటి ప్రాంతాలు సూర్యుడికి దగ్గరగా వచ్చి, మరింత ఎక్కువ వేడిని గ్రహించాయి.