తక్కువ ధరకే ఇంటర్నెట్, ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చి.. రిలయన్స్ జియో భారత్ టెలికాం రంగంలో విప్లవాన్ని తెచ్చింది. రిలయన్స్ తెచ్చిన ఈ మార్పుతో సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రమంలో జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయని సమాచారం. 'జియో బుక్' పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు విపణిలోకి రావొచ్చు.
అసలేమిటీ జియో బుక్..?
సెల్యులార్ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ల తయారీపై జియో ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన క్వాల్కమ్ టెక్నాలజీస్ సీనియర్ ప్రొడక్ట్ డైరక్టర్ మిగ్యుల్ న్యూన్స్ 2018లో తెలిపారు. ఆ తర్వాత సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సాధారణ ల్యాపీల్లా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో కాకుండా, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ఇవి పని చేయడం ఆసక్తికర విషయం. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఈ ల్యాపీల్లో వాడనున్నారు. దీనిని జియో ఓఎస్ అని పిలుస్తారని సమాచారం.