Nosh cooking robot: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో సరైన వంట వండుకుని తినేందుకు సమయం ఉండటం లేదు. ఎక్కువ రోజులు బయటి ఫుడ్ తింటే అనారోగ్యానికి గురవుతామని భయం. అలాంటి వారి కోసం బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ యుఫోటిక్ ల్యాబ్స్ ఓ పరిష్కారాన్ని చూపింది. 'నోష్' పేరుతో వంటలు చేసే సరికొత్త రోబోను తయారు చేసింది. మీ టేస్ట్‌కు తగ్గట్లుగా చిటికెలో సిద్ధం చేసేస్తుంది ఈ రోబో. మనం ఎక్కడ ఉన్నా.. ఇంటి వంట రూచి చూపిస్తుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు.
200కుపైగా వెరైటీలు..
నోష్ రోబో ఒక యాప్ ద్వారా పని చేసేలా ప్రోగ్రామింగ్ చేశారు. ఇది కడాయ్ పన్నీర్, మటన్ పన్నీర్, చికెన్, చేపల కూర, క్యారెట్ హల్వా, పొటాటో ఫ్రై వంటి 200కుపైగా రకాల వంటలు సిద్ధం చేస్తుందని చెబుతున్నారు సంస్థ సహ వ్యవస్థాపకుడు యతిన్ వరచియా.
సమస్య నుంచే ఆలోచన..
గుజరాత్‌లోని మారుమూల గ్రామానికి చెందిన యతిన్.. టెక్నాలజీలో మాస్టర్స్ చేసేందుకు 2008లో బెంగళూరు వెళ్లారు. అక్కడి వంటలు తనకు నచ్చేవి కావు. అక్కడే ఉద్యోగంలో చేరి.. పెళ్లి చేసుకున్నప్పటికీ సొంత ఊరి నుంచి పలు రకాల వంటకాలు తెప్పించుకునేవారు. భార్యాభర్తలు తమ పనుల్లో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండటం వల్ల నచ్చిన ఆహారం సిద్ధం చేసుకునేందుకు సమయం దొరికేది కాదు.
తమ సమస్యను తీర్చే ప్రొడక్ట్‌ను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు యతిన్. తన ఆలోచనను బెంగళూరుతో పాటు అమెరికాలోని స్నేహితులకు చెప్పారు. 2018లో తన ఉద్యోగాన్ని వదిలేసి.. యుఫోటిక్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. ముగ్గురు ఇంజనీర్లు ప్రణవ్ రావల్, అమిత్ గుప్తా, సందీప్ గుప్తా కలిసి నోష్ రోబోను తయారు చేశారు.
రోబో ఎలా పని చేస్తుంది?
రోబోను ఇంట్లో సులభంగా ఉపయోగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వంటకు కావాల్సిన నీళ్లు, నూనె, సుగంధ ద్రవ్యాలు, వంట సామగ్రిని వాటి కోసం కేటాయించిన బాక్సుల్లో ఉంచాలి. మనకు ఏ వంటకం కావాలో యాప్ ద్వారా రోబోకు సూచనలు ఇవ్వాలి.
వంట సామగ్రిని ఉంచేందుకు చేసిన ఏర్పాట్లు నోష్ రోబోలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు అమిత్. అందులో ఏఐ ఆధారిత కెమెరా ఉంటుందని తెలిపారు. వంటకు ఎంత మేర పదార్థాలు కావాలి, ఏది ముందుగా వేయాలి అనేది ప్రోగ్రామింగ్ చేసినట్లు చెప్పారు. ఉదాహరణకు.. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చాకే.. ఇతర పదార్థాలను వేస్తుంది. అలాగే.. మన టేస్ట్‌కు తగ్గట్లుగా దానికి ఆదేశాలు ఇవ్వొచ్చు. తక్కువ స్పైసీగా ఉండాలని, తక్కువ ఉప్పు వేయాలని.. మనకు కావాల్సినట్టుగా చేయించవచ్చు.
వివిధ రకాల వంటలను పొందుపరిచి, వందల సంఖ్యలో వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుని రోబోకు తుది రూపు ఇచ్చేందుకు మూడేళ్లు పట్టినట్లు చెప్పారు యతిన్. నోష్ రోబో చేసిన మొదటి డిష్ పొటాటో ఫ్రైగా గుర్తు చేసుకున్నారు. మంచి రుచికరంగా ఉన్నట్లు తెలిపారు.
"నోష్ ద్వారా వినియోగదారులు ఏ ఆహారం కావాలో ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గ్రాసరీ లిస్ట్ నుంచి మనకు కావాల్సినవి తీసుకునేలా యాప్ నుంచే ఆదేశాలు ఇవ్వొచ్చు. కేలరీలను ట్రాక్ చేయొచ్చు. రుచికి తగ్గట్లు పదార్థాలను నియంత్రించవచ్చు. కొత్త రెసిపీలను తయారు చేయొచ్చు కూడా "
- యతిన్, రూపకర్త
ధర ఎంత?
అన్ని విధాలుగా పరీక్షించిన తరువాత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది యూఫోటోస్ ల్యాబ్స్. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించారు. భారత్‌లో 50కిపైగా ఆర్డర్స్ వచ్చినట్లు చెబుతున్నారు. దేశంలో ఈ రోబో ధర రూ.40-50వేల మధ్య ఉంటుందని తెలిపారు. అలాగే.. అమెరికాలో దీని ధరను 699-1,299 డాలర్లుగా నిర్ణయించారు.
యుఫోటిక్ ల్యాబ్స్ సిద్ధం చేసిన రోబో
బెంగళూరులోని సంస్థలో ఇప్పటికే 1000కిపైగా యూనిట్లు తయారు చేశామని.. ఆర్డర్స్ వచ్చినదాని ప్రకారం మరిన్ని సిద్ధం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా భారత్‌తో పాటు అమెరికాలోని ప్రవాసీయులకు అందుబాటులో ఉంచుతామని, ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:Artificial Intelligence: కృత్రిమ మేధ.. ఇప్పుడిదే సర్వాంతర్యామి