NASA James Webb: నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి అంతరిక్ష చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడుదల చేశారు. విశ్వానికి సంబంధించి ఇప్పటివరకు మానవాళి చూడని అతి సుదూరమైన ఇన్ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. జేమ్స్ టెలిస్కోప్ బంధించిన ఈ చిత్రంలో చాలా నక్షత్రాలు ఉండగా ముందువైపు భారీ గెలాక్సీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విశాలమైన విశ్వంలో.. జేమ్స్ టెలిస్కోప్ తీసిన ఈ చిత్రం ఒక చిన్నపాటి మచ్చ వంటిదేనని బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు. ఈ టెలిస్కోప్ తీసిన నాలుగు చిత్రాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌గా జేమ్స్ వెబ్ స్పేస్ రికార్డు సృష్టించింది. దీనిని గతేడాది డిసెంబర్‌లో దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు.
అయితే, వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రం కంటే ఇంకా సుదూరమైన చిత్రాలనూ శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. కోబ్, డబ్ల్యూఎంఏపీ నాన్-ఇన్ఫ్రారెడ్ మిషన్లో భాగంగా.. మహా విస్పోటం (బిగ్ బ్యాంగ్) నాటి చిత్రాలను కనిపెట్టారు. బిగ్ బ్యాంగ్ సంభవించి సుమారు 1,380 కోట్ల సంవత్సరాలు అవుతోంది. కోబ్, డబ్ల్యూఎంఏపీ గుర్తించిన చిత్రాల్లో.. బిగ్ బ్యాంగ్ జరిగిన 3.8 లక్షల సంవత్సరాల తర్వాతి దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఆ చిత్రాల్లో మైక్రోవేవ్ రేడియేషన్ తప్ప.. నక్షత్రాలు, గెలాక్సీలు కనిపించవు. బిగ్ బ్యాంగ్ జరిగి పదుల కోట్ల సంవత్సరాలు అయినప్పటి చిత్రాన్ని ప్రస్తుతం వెబ్ టెలిస్కోపు గుర్తించింది.